TS Assembly: శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల
ABN , Publish Date - Feb 17 , 2024 | 10:51 AM
Telangana: నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17: నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో (Telangana Assembly) ప్రభుత్వం (Congress Government) శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. మేడిగడ్డ బ్యారెజ్ కుంగిన అంశంలో నిమిషం నీడివి గల వీడియోను మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విడుదల చేశారు.
ఇంతటి అవినీతి ఎక్కడా లేదు: ఉత్తమ్
కాళేశ్వరంలో (Kaleshwaram Project) మేడిగడ్డ (Medigadda Barrage) కీలక బ్యారేజీ అని మంత్రి ఉత్తమ్ అన్నారు. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగిపోయిందన్నారు. డిజైన్, నాణ్యతాలోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిన్నదని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో (National Dam Safety Authority) మాట్లాడుతున్నామన్నారు. స్వతంత్ర భారతంలో సాగునీటి రంగంలో ఇంత పెద్ద అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌నే సభ ముందు పెట్టామని తెలిపారు. ‘‘మీరు తప్పుకుంటే బాగు చేస్తామంటున్నారు.. కట్టింది మీరే, ఈ పరిస్థితి కారణమే మీరు.. ఇంకా మీకు అర్హత ఉందా?’’ అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో నాణ్యతా లోపం ఉందని ఎన్‌డీఎస్‌ఏ (NDSA) కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎక్కడా పరిశీలన జరగలేదన్నారు. కాగ్ రిపోర్ట్ (CAG Report) ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
అన్నారం బ్యారేజ్‌లోనూ లీకేజీ..
నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్‌లో (Annaram Barrage) లీక్ మొదలైందని తెలిపారు. అన్నారం బ్యారేజ్ కూడా కుంగేలా ఉందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ అధికారులను కూడా పిలిపించినట్లు చెప్పారు. బ్యారేజ్‌లో నీటిని కొంతమేర ఖాళీ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు సూచించినట్లు తెలిపారు. అన్నారం బ్యారేజ్‌కు కూడా ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు చెప్పారన్నారు.
కాళేశ్వరం ఆర్థికంగా నిరుపయోగం
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్థికంగా పూర్తిగా నిరుపయోగమని మంత్రి వ్యాఖ్యలు చేశారు. 2019 జూన్ 19న కేసీఆర్ (BRS Chief KCR) బ్యారేజ్‌ను ప్రారంభించారని, ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహణ పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని మోటర్లు ఒకే సారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాలన్నారు. రాష్ట్ర అవసరాలకు మొత్తం 160 మిలియన్ యూనిట్లు చాలని తెలిపారు. రాష్ట్రం మొత్తానికి కావాల్సిన విద్యుత్ కంటే కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ కరెంట్ కావాలన్నారు. కరెంట్ ఖర్చే ఏడాదికి రూ.10374 కోట్లు అవుతుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.81వేల కోట్లకు సీడబ్ల్యూసీ (CWC) ఆమోదం ఇచ్చిందన్నారు. కానీ రూ.1.47 లక్షల కోట్లకు వ్యయం పెరిగిందన్నారు. ఇవాల్టి లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తికి రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు. ప్రతీ రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలే అని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు లబ్ధి చేశారని కాగ్ నివేదిక చెప్పిందన్నారు.
మల్లన్న సాగర్‌పై...
ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్న సాగర్ (Mallanna Sagar) నిర్మించారన్నారు. చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా మల్లన్న సాగర్‌కు ప్రమాదమే అని అన్నారు. మల్లన్న సాగర్ పరిధిలోని ప్రజలకు ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించినట్లు తెలిపారు. నిజాంసాగర్ (Nizam Sagar) నిర్మించి వందేళ్లయినా పటిష్టంగానే ఉందన్నారు. మన సాగునీటి అవసరాలు సాగర్, శ్రీరాంసాగర్‌తో తీరుతున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project) మన విద్యుత్ అవసరాలను తీరుస్తుందని వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వీక్షించండి...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...