CS Shanti Kumari: పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , Publish Date - Jan 17 , 2024 | 10:23 PM
నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari ) బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari ) బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.... గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.
రాజ్‌భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని, అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖకు సూచించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణ, ఆహ్వానితులందరికీ తాగునీటి సరఫరా చేపట్టాలని మున్సిపల్ శాఖను కోరారు. అదేవిధంగా, ఇతర సంబంధిత శాఖలు తగిన విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్, డిఫెన్స్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.