Republic Day: పరేడ్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ABN , Publish Date - Jan 26 , 2024 | 09:30 AM
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పరేడ్ గ్రౌండ్స్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్‌లో కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పరేడ్ గ్రౌండ్స్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్‌లో కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పోలీసుల వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, అది సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా బుద్ది చెప్పిందన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ఈ తీర్పుతో స్పష్టమైందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభమైందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారిందని, వ్యవస్థలు గాడి తప్పాయని, అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమేనని, ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ప్రభుత్వ ప్రాధాన్యమని, ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
గత ప్రభుత్వ వైఫల్యంతో యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని గవర్నర్ అన్నారు. యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ జరుగుతోందని, ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురికావద్దని సూచించారు. రైతుల విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోందని, ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని, రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.
కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.