Share News

Elections: ఓ యువత మేలుకో.. ఓటు విలువ తెలుసుకో!

ABN , Publish Date - May 04 , 2024 | 08:12 PM

విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు.

Elections: ఓ యువత మేలుకో.. ఓటు విలువ తెలుసుకో!

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా , పతంజలి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓటరు చైతన్య కార్యక్రమం (రౌండ్ టేబుల్ సమావేశం)లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడటమే కాకుండా ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు, సలహాలు చేశారు. ఓటు వేయడం మన సంస్కృతిగా మారాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఓటర్ల సమస్యలనూ అర్థం చేసుకోవాలన్నారు. ఆన్ లైన్‌లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని, ముందుగా బోగస్ ఓట్లను తొలగించాలని సూచించారు.


కొన్ని ముఖ్యమైన సూచనలు :-

  • ఓటు హక్కు తప్పనిసరి విధిగా రాజ్యాంగంలో చేర్చాలి

  • ఓటు ప్రాముఖ్యత గురించి పాఠశాల విద్యార్థులకు తెలియజెప్పాలి

  • విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి

  • అపార్ట్మెంట్ వారందరూ ఒకే సారి ఓటు వేస్తే ప్రేరణ కలుగుతుంది

  • సామాజిక మాధ్యమాలను మరింతగా ఉపయోగించాలి

  • మంచి వారిని ఎన్నుకునే బాధ్యత మనదే.. ఎన్నికల సమయంలో కాకుండా నిరంతరం చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి

  • ఓట్లు అధికశాతం పోలవ్వాలంటే ప్రభుత్వమే ప్రజలకు రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించాలి.. మారుమూల ప్రాంతాల్లో ఇది అవసరం

  • మనం బతికున్నామని చెప్పడానికైనా ఓటేయాలి.. ఆ భావన పెంపొందించాలి

  • నా ప్రతినిధి పార్లమెంటులో ఉన్నాడనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి.

  • సెలవుగా భావించకుండా ఓటు వేసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలి

  • బూత్‌ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి.. బూత్ ఎక్కడో తెలిసేలా చర్యలు తీసుకోవాలి

  • ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తన ఓటు వేరే వారు వేసినా గ్రామీణులు గొడవ చేస్తారు.. కానీ చైతన్యం ఉన్న నగరాలలో ఆ పరిస్థితి లేదు. ఎన్జీవోలు వారిలో ఆలోచన రేకెత్తించాలి

  • పోలింగ్ కేంద్రాలలో సాంకేతిక సమస్యలతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా జరగకుండా చూడాలి.

  • ఒక్క ఓటు ఫలితాలను తారుమారు చేస్తుంది. అందువల్ల నేనొక్కడిని ఓటు వేయకుంటే ఏమవుతుందనే నిర్లిప్తతను వదిలేయాలి.

  • విద్యార్థులకు, యువతకు తగిన మార్గదర్శనం చేస్తే ఫలితం ఉంటుంది.

  • ఓటింగ్ లిటరసీ చాలా ముఖ్యం.. ఎవరికి, ఎందుకు ఓటేయాలన్న చైతన్యం ముఖ్యం

  • వరుని ఎంపికలాగా జాగ్రత్తలు తీసుకోవాలి.. స్వీయ ఆలోచనతో ఓటు వేయాలి

  • ప్రభుత్వం ఎలా ఉండాలో నిర్ణయం మనదే.. మన ఓటు సమాజానికి చేయకూడదు చేటు!

  • ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటరు చైతన్యం అవసరం అని.. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు సంజయ్ ఉపాధ్యాయ, వేదికప్ ప్రొ మురళీ మనోహర్, నందనం కృపాకర్, శ్రీధర్ రావు, రావికంటి శ్రీనివాస్, ప్రొ గోపాల్ రెడ్డి, డా. కసిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 08:12 PM