Share News

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు

ABN , Publish Date - Oct 16 , 2024 | 08:45 PM

ముత్యాలమ్మ గుడిపై దాడి కేసులో మోటివేషనల్‌ స్పీకర్ మునావర్ జామ, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు..

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు
Mutyalamma Temple

సికింద్రాబాద్ సమీపంలోని ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటనలో పోలీసులు రెండో కేసు నమోదైంది. మెట్రో పోలీస్ హోటల్‌‌పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సురేష్ ఫిర్యాదుతో 299, 192, 196, 223, 49 బిఎన్ఎస్ ప్రకారంగా కేసు పెట్టారు. ముగ్గురిని నిందితులుగా పేర్కొనగా.. వీరిలో మోటివేషనల్‌ స్పీకర్ మునావర్ జామ, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌ ఉన్నారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు సల్మాన్ హోటల్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు మెట్రో పోలీస్ హెటల్‌లో మునావర్ జామ ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ సదస్సు ఏర్పాటుచేసి కొందరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 151 మందికి ఈ హోటల్‌లో బస కల్పించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 49 రూమ్స్‌ను దుండగులు బుక్ చేశారని, ఎలాంటి అనుమతలు తీసుకోకుండా మునావర్ జామ్ సదస్సు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.


హోటల్ యాజమాన్య సహకారం..

మునావర్ జామ సదస్సుకు మెట్రో పోలీస్ హోటల్‌ యజమాని సహకరంచినట్లు పోలీసులు గుర్తించారు. మునావర్ జామ రెండు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కోసమే సదస్సు ఏర్పాటుచేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ సురేష్ ఫిర్యాదు చేశారు. మునావర్ మోటివేషన్ క్లాస్ తర్వాతే అమ్మవారి గుడిపై సల్మాన్ దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడంతో స్థానికులతో పాటు హైందవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నిందితులపై కఠినంగా వ్యవహారిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలను పరిశీలించిన తర్వాత నిందితులను గుర్తించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగింది..

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని కొంత మంది దుండగులు అక్రమంగా ప్రవేశించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాడిని గమనించిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులను గమనించిన దుండగులు పారిపోగా.. ఒకరు మాత్రం వారికి చేతికి చిక్కాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మవారి ఆలయంపై దాడి చేయడాన్ని హిందువులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయం వద్దకు పెద్దఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 16 , 2024 | 08:45 PM