Telangana: వారికి మాత్రమే రైతుబంధు.. కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , First Publish Date - 2024-02-10T15:42:07+05:30 IST
Telangana CM Revanth Reddy: తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం. బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అనర్హులకు రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం. బడ్జెట్ సమావేశాల(Telangana Budget 2024) అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదన్నారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించామన్నారు సీఎం. అబద్ధాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. పదేళ్లు అయినా కేసీఆర్‌కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదని విమర్శించారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు సీఎం. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కమీషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వం లాగే అవుతుందని, రుణమాఫీ బరాబర్ రద్దు చేస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామన్నారు సీఎం.
తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది..
అసెంబ్లీ ప్రొసీజర్ అంతా స్పీకర్ చూస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పే అంశం సభా అధికారులు చూసుకుంటారని, తెలంగాణ భాష ఇలాగే ఉంటుందని అన్నారు. 2014లో టీడీపీ బీఏసీ మెంబర్లుగా తనను, ఎర్రబెల్లి దయాకర్ రావును పార్టీ నిర్ణయించిందని, కానీ హరీష్ రావు తనను బీఏసీకి రానివ్వలేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
అవినీతిపై విచారణ..
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామన్నారు. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిపామని.. జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు సీఎం. మేడిగడ్డకు వెళ్దామని ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించానని చెప్పిన సీఎం.. 13వ తేదీన బీఆర్ఎస్ వాళ్లకు మీటింగ్ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదాం అన్నా తాము సిద్ధం అని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
వారిని అవమానిస్తున్నారు..
తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అగ్రనేతలు అవమానిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశంవ తన దృష్టిలో లేదని, ఎవరైనా వచ్చేందుకు రెడీగా ఉంటే.. వారి విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.