Share News

CM Revanth Reddy: మోదీ.. ఇది సరికాదు.. కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ ఫైర్

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:38 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు..

CM Revanth Reddy: మోదీ.. ఇది సరికాదు.. కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.ప్రధాని తెలంగాణకు వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగాను. పెద్దన్నలా ఉండాల్సిన ప్రధానికి ఇది సరికాదు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిధులు అడిగాం. ప్రధాని మోదీని నేనే మూడుసార్లు కలిసి అడిగాను. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పాను. అయినా తెలంగాణకు అన్యాయం జరిగింది. మా మంత్రులు కూడా కేంద్ర మంత్రులను కలిశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కోరాం. బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీకి ఉన్న కక్షను మరోసారి చాటారుఅని రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


Revanth-Reddy.jpg

ఏపీకి సరే మా సంగతేంటి..?

ఏపీకి ఎన్నిరకాలుగా కేటాయింపులు చేయాలో అన్ని రకాలుగా కేటాయించారు. ఏపీకి ఎందుకు నిధులు ఇస్తున్నారు..? అని మేం అడగడం లేదు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏపీకి నిధులు కేటాయించారు. తెలంగాణ విషయంలో ఇంత కక్ష ఎందుకు?. గుజరాత్‌కు ఎలా నిధులు కేటాయించారో, మూసీకి అలా నిధులు కేటాయించామని ప్రధాని మోదీని అడిగాను. హైదరాబాద్‌కు నిధులు ఇస్తే దేశ ఎకానమికి ఉపయోగపడుతుందని మోదీకి వివరించాను. పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఐటీఐఆర్ కారిడార్ మరుగున పడింది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్ అని బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్‌లో మా రాష్ట్రం ఉండదా?అని కేంద్రంపై రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు.


Modi-And-Revanth.jpg

కుర్చీ బచావో..!

‘కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్‌లాగా ఉంది. ఇంత కక్షపూరిత బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికల ముందే చెప్పాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించి మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది. తెలంగాణకి ఇవ్వండి అని లేఖ రాశాను. తెలంగాణకు ఐఐఎం ఇవ్వము అని ధర్మేంద్ర ప్రధాన్ మూడు రోజుల క్రితం లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమే పెట్టినట్టు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మా ఎంపీలతో పార్లమెంట్‌లో నిరసన తెలియచేస్తాం. తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చూస్తూ ఊరుకోరు. ఏపీ పునర్విభజన చట్రంలో ఏపీకి ఇవ్వాల్సిన అంశాలతో పాటు తెలంగాణకి ఇవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. బడ్జెట్ సవరించే అవకాశం ఉంది. బడ్జెట్ సవరించి మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫార్మా విలేజ్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలి. బీజేపీ చేతకానీ తనం, బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ అన్యాయం అవుతోంది అని కేంద్రంపై రేవంత్ మండిపడ్డారు.

Updated Date - Jul 23 , 2024 | 05:57 PM