MBBS : పోయేది ఎక్కువ.. వచ్చేది తక్కువ
ABN , Publish Date - Oct 17 , 2024 | 04:36 AM
తెలంగాణలోని ఎంబీబీఎస్ సీట్లు ఉత్తరాది విద్యార్థులకు వరంగా మారాయి. అఖిల భారత కోటాలో ఆప్షన్‌గా మన రాష్ట్రాన్నే పెట్టుకుంటున్నారు.
తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లపై ఉత్తరాది విద్యార్థుల కన్ను.. అక్కడినుంచి మన రాష్ట్రానికి మూడేళ్లలో 1,500 మంది!
అఖిల భారత కోటాలో 617 సీట్లు.. మనవాళ్ల ఆనాసక్తి
తెలంగాణ విద్యార్థులు చేరేది 100 నుంచి 120 మధ్యనే
ఉత్తరాది వారికి కలిసొచ్చిన భాష, ఆహారం, సంస్కృతి
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఎంబీబీఎస్ సీట్లు ఉత్తరాది విద్యార్థులకు వరంగా మారాయి. అఖిల భారత కోటాలో ఆప్షన్‌గా మన రాష్ట్రాన్నే పెట్టుకుంటున్నారు. ఏటా సుమారు 500 మంది ఇక్కడి ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్నారు. మూడేళ్లుగా ఈ ధోరణి పెరుగుతోందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 1,500 మంది పైగా ఉత్తరాది రాష్ట్రాల వారు తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తున్నారని పేర్కొన్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలో మూడేళ్లలో 25 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య బాగా పెరిగి.. 4,115కు చేరాయి. అయితే, వీటిలో 15 శాతం అఖిల భారత కోటాకు కేటాయించాలి. అంటే.. 617 సీట్లు. వీటికి దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు.
మనవారు వెళ్లరు.. వారు వస్తారు..
అఖిల భారత కోటా లేకుంటే అన్ని సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయి. అంటే.. అఖిల భారత కోటాలో చేరడంతో వచ్చేది తక్కువ.. పోయేది ఎక్కువ అన్నట్లుగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీ రాకపోవడం, సరైన ఆహారం దొరకదనే కారణంగా చాలామంది, ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తరాది రాష్ట్రాలకు పంపేందుకు మొగ్గుచూపడం లేదు. పిల్లలను బయటకు పంపేందుకు వీరు ఏమాత్రం ఆసక్తిగా లేరు. మరీ కొందరైతే ఏపీలో సీటు వచ్చినా వెళ్లడం లేదని ఆరోగ్య విశ్వ విద్యాలయ వర్గాలు చెప్పాయి. దగ్గర్లోనే కళాశాల ఉండాలనే అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమవుతోంది. అందుకే అఖిల భారత కోటాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అప్లై చేయడం లేదు..
కాగా, మన రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల ప్రకారం కనీసం 500-600 మందికి అఖిల భారత కోటాలో సీట్లు వస్తాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కానీ, రాష్ట్రంలోనే ఉండి ఎంబీబీఎస్ చేయాలన్న ఉద్దేశంలో దరఖాస్తు చేయడం లేదు. 100- 120 మంది మాత్రమే దరఖాస్తు చేసి చేరిపోతున్నారు. టాప్ ర్యాంకర్లు మాత్రం అఖిల భారత కోటాను పట్టించుకోకుండా ఇక్కడే ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు పొందుతున్నారు. దీంతో రాష్ట్రానికే చెందిన ఇతర విద్యార్థులు అవకాశాలను కోల్పోతున్నారు. కాగా, ప్రభుత్వం తరఫున 25 కళాశాలలే కాక.. ఐదారేళ్లల్లో హైదరాబాద్ చుట్టపక్కల 10-15 కొత్త ప్రైవేటు వైద్య కళాశాలు వచ్చాయి. దీంతో సీట్లు పెరిగాయి. ఇక జీహెచ్‌ఎంసీలో 10 దాకా, 50 కిలోమీటర్లలోపు మరో 10 వరకు ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇతర రాష్ట్రాల వారు గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.
రెండేళ్ల కిందట బీలో.. ఇప్పుడు సిలో
తెలంగాణలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ, సీ కేటగిరీల్లో చేరేందుకూ ఇతర రాష్ట్ర విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్ల క్రితం బి కేటగిరీలో 50 శాతం మంది వారే చేరేవారు. గత ప్రభుత్వం ఇందులోనూ 85 శాతం సీట్లు స్థానికులకే కేటాయించాలన్న నిబంధన పెట్టింది. దాంతో బయటివారికి అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం సీ కేటగిరీలో చేరేవారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణే ముద్దు..
తెలంగాణలో చదివేందుకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆసక్తి చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై వివక్ష ఉండదు. ఏపీ, తమిళనాడులో ఇలాంటి పరిస్థితి లేదని విద్యార్థులే చెబుతున్నారు. తమిళనాడుపై అయితే అసలు చూడడమే లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలో అన్ని రకాల సంస్కృతులు ఉంటాయి. అన్ని రాష్ట్రాల ఆహారం దొరుకుతుంది. హిందీ, ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ కావడంతో ఉత్తరాది విద్యార్థులకు ఇష్టమైనదిగా మారింది. జీవన వ్యయం బెంగళూరు, చెన్నై కంటే తక్కువ. అన్నింటికిమించి మిగతా నగరాల కటే హైదరాబాద్‌కు విమానం, రైల్ ద్వారా గంటల్లోనే చేరుకోవచ్చు.