Konda Surekha vs KTR: ఆ హీరోయిన్లతో కేటీఆర్ ఏం చేశారంటే.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 04:28 PM
కొందరు హీరోయిన్లు హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. రకుల్‌ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రయివేట్ సంభాషణను రికార్డు చేసి..
తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేయడంతో పాటు.. కేటీఆర్ తీసుకున్నారన్నారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే కేటీఆర్‌కు గౌరవం లేదంటూ ఆయన టార్గెట్‌గా పలు ఆరోపణలు చేశారు. వీలైనంత త్వరగా కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రయివేట్ సంభాషణను రికార్డు చేసి.. వాటిని హీరోయిన్లకు వినిపించి.. కొందరిని లోబర్చుకున్నారని, తన మాట వినకపోతే రికార్డులు బయటపెడతానంటూ బెదిరించారని కొండ సురేఖ తెలిపారు. ఈ విషయం సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసన్నారు. కొందరు హీరోయిన్లను లోబర్చుకుని డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అని సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.
విచారణ చేస్తాం..
ఎవరైనా హీరోయిన్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నకు మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. వాళ్లెవరూ బయటకు రారని, ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణ చేస్తుందన్నారు. దర్యాప్తులో హీరోయిన్ల పేర్లు వచ్చినా వాటిని బయటపెట్టబోమని.. నిందితులను మాత్రం వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. సమంత, నాగచైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం అందిరకీ తెలుసని, ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఏం జరిగింది..?
ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ట్రోలింగ్స్‌పై హరీష్‌రావు స్పందిస్తూ.. కొండా సురేఖను ఉద్దేశించి చేసిన పోస్టులు సమర్థనీయం కాదన్నారు. అయినప్పటికీ కేటీఆర్ వీటిపై స్పందిచకపోవడంతో ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. తాజాగా కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here