Health Screening: 30 దాటితే.. బీపీ, షుగర్ ముప్పున్నట్లే!
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:09 AM
రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటినవారిలో పలువురు రక్తపోటు, మధుమేహం ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ రెండూ శరీరాన్ని రోగాల మయం చేస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా మారి ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి.
23 లక్షల మందికి అధిక రక్తపోటు
12 లక్షల మందికి మధుమేహం
ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో తేలిన వైనం
ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక
అత్యధిక కేసులు మెదక్ జిల్లాలో..
తర్వాత నిర్మల్, కామారెడ్డి, నల్లగొండ
జీవనశైలిలో మార్పులతోనే సమస్యలు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటినవారిలో పలువురు రక్తపోటు, మధుమేహం ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ రెండూ శరీరాన్ని రోగాల మయం చేస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా మారి ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. 30 ఏళ్లు దాటిన వారికి రాష్ట్ర వైద్యశాఖ అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) స్ర్కీనింగ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు విడతల స్ర్కీనింగ్ పూర్తయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు చివరి వరకు చేసిన స్ర్కీనింగ్‌లో 12.06 శాతం మంది బీపీ, 6.24 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్న విషయం బయటపడింది. ఆ వివరాలను తాజాగా సర్కారుకు నివేదిక రూపంలో అందించింది.
1.93 కోట్ల మంది..
రాష్ట్రంలో 30 ఏళ్లుదాటిన వారు 1.93 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఎన్‌సీడీ స్ర్కీనింగ్ చేయాలని వైద్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇంటింటి సర్వే చేస్తున్నారు. దీంట్లో భాగంగా జరిపిన స్ర్కీనింగ్‌లో 23,29,558 మంది (12.06 శాతం) అధిక రక్తపోటుతో, మరో 12,05,329 మంది (6.24 శాతం) షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారిలో 26 శాతం మంది బీపీ, మరో 13 శాతం మంది షుగర్ బాధితులుంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా. ఇప్పటి దాకా చేసిన స్ర్కీనింగ్‌లో 12 శాతం మంది బీపీ బాధితులు బయటపడగా, మరో 14 శాతం మందిని గుర్తించాల్సివుంది. అలాగే షుగర్ బాధితులకు సంబంధించి ఇప్పటి దాకా 6 శాతమే బయటపడగా, మరో 7 శాతం బాధితుల్ని గుర్తించాల్సి వుంది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
బీపీ, షుగర్ బాధితుల్లో మెదక్ అగ్రస్థానం
అత్యధిక బీపీ, షుగర్ బాధితులు మెదక్ జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలోనే ఆ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 30 దాటిన వారిలో ఆ జిల్లాలో 4,22,773 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 89,427 మందికి బీపీ, 54,515 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 22 శాతంమంది రక్తపోటు, 12.89 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇక రెండోస్థానంలో నిర్మల్ జిల్లా నిలిచింది. అక్కడ 3,94,803 మందికి టెస్టులు చేయగా, అందులో 19.14 శాతం మందికి బీపీ, 9.68 మందికి షుగర్ ఉందని గుర్తించారు. మూడో స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 5,38,219 మందికి పరీక్షలు నిర్వహించగా.. 96,288 మందికి బీపీ, 61,117 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. అంటే 18 శాతం మంది బీపీతో, 11.35 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 4వస్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది. అక్కడ 9,09,838 మందికి టెస్టులు చేశారు. అందులో 17.74 శాతం మందికి బీపీ, 9.36 శాతం మందికి షుగర్ ఉందని తేలింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 17 శాతం మంది బీపీతో, 9.77 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వైల్లడైంది.
సైలెంట్ కిల్లర్స్
చాలామంది బీపీ, షుగర్ బాధితులకు తాము వాటి బారినపడ్డ సంగతే తెలియడం లేదు. గుర్తించిన వారిలో కూడా చాలామంది నిత్యం ఔషధాలను వాడటం లేదు. కేవలం 40 శాతం మందే రోజూ మందులు వేసుకుంటున్నట్లు వైద్యశాఖ పరిశీలనలో తేలింది. బీపీకి, షుగర్‌కు వేర్వేరుగా ట్లాబ్లెట్స్ వేసుకోవాల్సి రావడంతో కొంతమంది మర్చిపోతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతోపాటు ప్రతీ ఆరు నెలలకు పరీక్షలు చేసి, ఔషధాలను మార్చాల్సి ఉంటుంది. చాలామంది రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడం లేదు. దీంతో బీపీ, షుగర్ నియంత్రణ కావటం లేదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
జీవనశైలి కారణంగానే!
ప్రస్తుతం అసాంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పుల కారణంగానే వీటి ముప్పు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్ మాత్రమే కాదు.. గుండె, కిడ్నీ జబ్బులు, సీవోపీడీ, క్యాన్సర్ కేసులు కూడా తెలంగాణలో బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపే పలువురు వీటి బారినపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆఫీసుల్లో తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం, సమయానికి తినకపోవడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ అసలు లేకపోవడం లాంటివి వీటికి ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి
ప్రస్తుతం 30లోపువారిలో ఎక్కువగా బీపీ, షుగర్ కనిపిస్తున్నాయి. బీపీ కంటే కూడా షుగర్ మరింత ప్రమాదకరం. మద్యం, ధూమపానంతో పాటు ఇటీవల డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అది కూడా ఎన్‌సీడీ జబ్బుల తీవ్రత పెరగడానికి కారణమౌతోంది. గత పదేళ్లతో పొల్చితే వీటి బారినపడేవారి సంఖ్య ఎక్కువవైంది. ప్రతీ ఐదుగురిలో ఒకరు బీపీ బారినపడినట్లు 2022లో మేం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వైద్యుల సలహాతో వీటికి నిత్యం ఔషధాలు వాడాలి. సాధ్యమైనంత వరకు జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.
- డాక్టర్ మాదల కిరణ్, గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్