Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:45 AM
రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని కొనియాడారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు.
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఆయన నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడిపోవడంతో, రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్‌బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంతకాలం చదివిన అనంతరం.. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్‌డేల్ కంట్రీ హైస్కూల్‌లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్ టాటా.. 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలకా్ట్రనిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తిచేశారు. 1991లో జేఆర్‌డీ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎ్‌సను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు.. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు.