Telangana: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్..
ABN , Publish Date - Aug 18 , 2024 | 02:13 PM
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు. ఇదే అంశంపై ఇటీవల విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..
హైదరాబాద్, ఆగష్టు 18: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు. ఇదే అంశంపై ఇటీవల విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్పై, ఆ పార్టీ అగ్ర నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టి బొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ నిలదీశారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ విలీన డ్రామాలను తెరమీదకు తీసుకువస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో రూ. 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు కేటాయించి.. చివరకు రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాలకు ప్రజలకు అర్థమయ్యాయని తెలిసే ఈ విలీన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.
కాగా, గత రెండు రోజుల నుంచి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతలు.. లేదు లేదు కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ నేతలు వరుస ప్రకటనలు చేస్తూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నారు. మరోవైపు.. చిల్లర ప్రచారాలు మానుకోవాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఎవరి ప్రకటన ఎంత నిజమనేది తెలియాలంటే ఎదురు చూస్తూ ఉండాల్సిందే.