Ganesh Laddu: లడ్డూ లాంటి హోదా!
ABN , Publish Date - Sep 17 , 2024 | 03:05 AM
ఎప్పుడో.. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ మండపం వద్ద సరదాగా మొదలైన లడ్డూ వేలం పాట ఇప్పుడో ట్రెండ్!
వేలం పాటలో పోటాపోటీ.. సెంటిమెంటు కన్నా సమాజంలో పరపతి పెరుగుతుందనే భావనే ఎక్కువ
ఉండ్రాలయ్య అండదండలు దండిగా ఉండాలన్నా.. తొండమెత్తి దీవించాలన్నా బొజ్జ గణపతికి 11 రోజుల పాటు పూజలు చేస్తే సరిపోతుందా? లంబోదరుడి చేతుల్లోని లడ్డూను కూడా దక్కించుకోవాలి! పార్వతీ సుతుడితో పాటు పూజలందుకున్న ఆ లడ్డూ కోసం వేలంలో ఎంతవరకైనా వెళ్లి పాడాలి! ఆ లడ్డూ దక్కితేనే ఏకదంతుడు అనేక వరాలు కుమ్మరిస్తాడు.. ఆ ఏడాదంతా అన్నీ శుభాలే జరుగుతాయి! ఈ సెంటిమెంటు అనే ఘాటు భక్తుల్లో రానురాను పెరుగుతోంది.
పాటలో రియల్టర్లు, వ్యాపారుల హవా
కాలనీ, అపార్ట్‌మెంట్లలోకీ వేలం సంస్కృతి
బాలాపూర్‌లో మొదలైన సంప్రదాయం
అప్పట్లో రూ.450.. ఇప్పుడు లక్షల్లో కామన్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడో.. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ మండపం వద్ద సరదాగా మొదలైన లడ్డూ వేలం పాట ఇప్పుడో ట్రెండ్! అప్పట్లో.. బాలాపూర్‌లో లడ్డూ రూ.450 పలికితే అదో అద్భుతం! నిరుడు అదే మండపం వద్ద లడ్డూ రూ.27 లక్షలు పలికింది. ఇక్కడే కాదు.. నగరంలో చాలాచోట్ల లడ్డూ వేలం రూ.లక్షల్లో పలుకుతోందిప్పుడు! ఈ వేలం సంస్కృతి కాలనీల్లోనే కాదు.. అపార్ట్‌మెంట్ల పరిధిలో పెడుతున్న మండపాలకూ పాకింది. వేలం పాట లక్షల్లో ఉంటున్న చాలాచోట్ల రియల్టర్లు, బడా వ్యాపారులు రేసులో ముందుంటున్నారు. ఇప్పుడు లడ్డూ కోసం సామాన్య ప్రజలూ పోటీపడుతున్నారు. అవరమైతే అప్పు చేస్తున్నారు.
అంటే.. గణేశ్ లడ్డూ దొరకడం ఓ సెంటిమెంట్‌కు మించి! లడ్డూ దక్కించుకుంటే అందరూ గుర్తిస్తారు. సమాజంలో హోదా, పరపతి రాత్రికి రాత్రే పెరుగుతుందన్నమాట. రాజకీయ ప్రయోజనాలు, కంపెనీల ప్రచారం తదితర కారణాల కోసం కూడా కొందరు లడ్డూ వేలంలో పాల్గొంటున్నారు. లడ్డూను వేలంలో సొంతం చేసుకుంటే పరపతి పెరుగుతుందంటున్నారు రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి. మూసాపేటలో ఉండే ఈయన తొలిసారిగా గణేశ్ లడ్డూను వేలం పాటలో గెలుచుకున్న తర్వాతే వ్యాపారంలోకి ప్రవేశించానని, కాలనీలో జనం తనను గుర్తు పడుతున్నారని, అదే తనకు వ్యాపారంలో విజయం సాధించేందుకు తోడ్పడిందని చెబుతున్నారు.
ఇక.. ఫలానా మండపం వద్ద లడ్డూ దక్కించుకుంటే మరింత శుభదాయకం అనే భావనా భక్తుల్లో పాకిపోయింది. హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు అనగానే తొలుత గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే కావొచ్చు.. కానీ లడ్డూ వేలం అంటే స్ఫురణకొచ్చేది బాలాపూర్ గణపతే. అక్కడ లడ్డూ దక్కించుకునేందుకు ఐదారేళ్లు పోటీపడ్డవారూ ఉన్నారు. ఈసారి.. నార్సింగ్ మైహోం అవతార్‌లోని గణేశ్ లడ్డూ రూ.7.51 లక్షలు, గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూ రూ.7.50 లక్షలు పలికింది. సాధారణంగా లడ్డూ కిలో నుంచి 21 కేజీల వరకూ ఉంటాయి. లక్షల్లో పలుకుతాయి.
పొలంలో చల్లితే దిగుబడి ఎక్కువ
వేలం పాటలో గెలుచుకున్న లడ్డూను వ్యాపారులైతే అయితే వ్యాపార చేస్తున్న చోట ఉంచితే బిజినెస్ బాగా సాగుతుందని.. రైతులైతే పొలంలో చల్లితే పంటల దిగుబడి బాగా వస్తుందని నమ్ముతున్నారు. ఇక.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును చాలాచోట్ల వచ్చే ఏడాది వేడుకల కోసం ఖర్చు పెడుతున్నారు. బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి నిర్వాహకులు మాత్రం గత కొన్నేళ్లుగా లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణకు అందిస్తున్నామని చెబుతున్నారు. స్థానికంగా కొన్ని దేవాలయాల నిర్మాణాలకు, పునరుద్ధరణకూ వినియోగించినట్లు చెప్పారు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోనైతే ఆ వచ్చిన డబ్బును అనాథ, వృద్ధాశ్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. మై హోం విహంగలో లడ్డూ వేలం ఈసారి రూ.5.3 లక్షలు పలికింది. ఈ మొత్తాన్ని అనాథాశ్రమంలో పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.