Share News

National Highway: ప్రమాద రహితంగా విజయవాడ హైవే

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:10 AM

హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణం వైద్య సాయం అందేలా కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ట్రామా కేర్‌ సెంటర్‌ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

National Highway: ప్రమాద రహితంగా విజయవాడ హైవే

  • 2 నెలల్లో అందుబాటులోకి ట్రామాకేర్‌

  • క్షతగాత్రుల తరలింపునకు హెలికాప్టర్‌

  • 6 నెలల్లో 6ు లేన్ల రహదారిగా అభివృద్ధి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ట్రామాకేర్‌ సెంటర్‌కు శంకుస్థాపన

కేతేపల్లి, జూలై 8: హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణం వైద్య సాయం అందేలా కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ట్రామా కేర్‌ సెంటర్‌ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భారత్‌లో ఆటోమెటిక్‌ డేటాబేస్‌ ప్రాసెస్‌ (ఏడీపీ) సంస్థను ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌)లో భాగంగా రూ.5కోట్ల వ్యయంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ను నిర్మించనుంది. ఈ మేరకు సోమవారం ఏడీపీ ఇండియా హెడ్‌ విజయ్‌ వేములపల్లితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ - విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి డెత్‌ రోడ్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిని ఆరు లేన్లుగా మార్చి ప్రమాదాలను నివారించాలని పలు మార్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి విన్నవించానని, కేంద్ర మంత్రికి తాను కనిపించగానే డెత్‌రోడ్‌ నేత వస్తున్నాడని ఆటపట్టించే వారని గుర్తు చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 17 బ్లాక్‌స్పాట్ల వద్ద జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పునరావృతం కావొద్దన్న ఉద్దేశంతోనే ఏడీపీ సంస్థ సహకారంతో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోల్డెన్‌ అవర్‌(ప్రమాదం జరిగిన మొదటి గంటలో అందించే వైద్యం)లో తక్షణం వైద్యసాయం అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.


అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా మెరుగైన వైద్యం అందించాల్సి ఉంటే హెలికాప్టర్‌ను సైతం వినియోగించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సెంటర్‌ నిర్మాణ పనులను రెండు నెలల్లోనే పూర్తి చేసి, సెప్టెంబరు 7వ తేదీలోగా ప్రారంభించేందుకు ఏడీపీ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. 65వ నెంబరు జాతీయ రహదారి వచ్చే ఆరు నెలల్లో ఆరు లేన్లుగా మారబోతుందని, దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా కేవలం రెండు గంటల వ్యవధిలో చేరవచ్చన్నారు. మురికి కూపంగా మారిన మూసీ నది సుందరీకరణను రూ.30-40వేల కోట్ల వ్యయంతో త్వరలో చేపడతామని ఆయన చెప్పారు.

Updated Date - Jul 09 , 2024 | 03:10 AM