Share News

Hydra Strategy: బ్యాంకర్లూ బాధ్యులే?

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:01 AM

ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది.

Hydra Strategy: బ్యాంకర్లూ బాధ్యులే?

  • కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా యోచన

  • సాంకేతిక, న్యాయపరమైన అంశాలు పట్టించుకోకుండా రుణాలు

  • త్వరలో బ్యాంకర్లతో రంగనాథ్‌ భేటీ

  • బాధితులకు న్యాయం చేసేలా చర్యలు?

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. స్థలాల యాజమాన్యపు హక్కులు, అనుమతులు, ఇతరత్రా విషయాలకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలను పట్టించుకోకుండా రుణాలు ఇచ్చినందుకు బ్యాంకర్లనూ బాధ్యులను చేయాలని హైడ్రా భావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసిన, అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అదే సమయంలో రుణాల చెల్లింపులో బాధితులకు ఉపశమనం కలిగించే విషయంపైనా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా త్వరలో రుణాలు మంజూరు చేసిన సంస్థల ప్రతినిధులతో కమిషనర్‌ రంగాథ్‌ సమావేశం కానున్నారు. ఆయా అంశాలపై ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో చర్చించడంతోపాటు.. న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిసింది.


  • అనుమతులు రద్దు చేశాక లోన్లు

ఇళ్లు, ఫ్లాట్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకర్లు అన్ని అంశాలను పరిశీలించాలి. స్థలం యాజమాన్యపు హక్కులు, సంబంధిత సంస్థల నుంచి అనుమతులున్నాయా? అవి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నది చూడాలి. ఇందుకోసం క్షేత్రస్థాయి బృందాలు.. న్యాయపరమైన అభిప్రాయం తీసుకునేందుకు బ్యాంకులకు లీగల్‌ టీమ్‌లు ఉంటాయి. అమీన్‌పూర్‌లో ఇటీవల జరిగిన కూల్చివేతలకు సంబంధించి గత జూలైలోనే అనుమతులను మునిసిపాలిటీ రద్దు చేసింది. అయినా.. రియల్‌ వ్యాపారులతో కుమ్మక్కైన పలు రుణ సంస్థల ప్రతినిధులు అన్నీ సక్రమంగా ఉన్నట్లు నివేదిక పంపి లోన్‌ మంజూరుకు సిఫారసు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. లోన్‌ వస్తుందన్న ఉద్దేశంతో పౌరులు విల్లాలు కొనుగోలు చేశారు.


పార్కు స్థలంలో అనుమతులిచ్చి రద్దు చేసిన మునిసిపల్‌ అధికారులు మొదట తప్పు చేస్తే.. రియల్‌ వ్యాపారులతో కుమ్మక్కై రుణ సంస్థల ప్రతినిధులూ అంతే పొరపాటు చేశారని హైడ్రా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకర్లనూ బాధ్యులను చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. రుణం మంజూరు చేసిన సంస్థలు మార్ట్‌గేజ్‌ చేసుకున్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. స్థలాలు సర్కారువని తేలిన నేపథ్యంలో ఏ ఆధారంతో బ్యాంకర్లు రుణం వసూలు చేస్తారనే విషయంపైనా నిపుణులతో హైడ్రా అధికారులు చర్చిస్తున్నారు. బాధితులు రుణం చెల్లించకుండా ఉండే అవకాశముందా? అన్న దానిపై న్యాయ సలహాలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - Sep 26 , 2024 | 07:55 AM