Hyderabad: రాహులే దేశానికి కాబోయే ప్రధాని ఆయనంటే మోదీ, అమిత్‌షాలకు దడ..
ABN , Publish Date - May 01 , 2024 | 03:53 AM
దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని, ఆయన ప్రధాని అయితేనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లోకి వెలుగులు వస్తాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
వారి ఆదేశాల మేరకే గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు
బీజేపీ జేబు సంస్థగా ఈసీ: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని, ఆయన ప్రధాని అయితేనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లోకి వెలుగులు వస్తాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఈ వర్గాలంతా రాహుల్‌గాంధీ వెంటే ఉన్నారన్న విషయం తెలిసి బీజేపీకి భయం మొదలైందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు తాము వ్యతిరేకం కాదంటూ ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మొదటిసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాహుల్‌గాంధీ వల్లనే వచ్చిందని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధా ని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, దీంతో మోదీ, అమిత్‌షాలో దడ మొదలైందని, అందుకే గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపారన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
అబద్ధాలను కూడా నిజం అనట్లుగా మాట్లాడి గోబెల్స్ ప్రచారానికి మోదీ పూనుకున్నారని, పదేళ్లు ప్రధానిగా ఉన్న ఆయన అబద్ధాలు ఆడటం భావ్యమా అని ప్రశ్నించారు. ‘‘తాళిబొట్లు తెంచి ముస్లింలకు ఇస్తారంటూ.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ చెప్పడం దారుణం. ఆయన వ్యాఖ్యలకు ఆధారం ఏదైనా ఉందా? చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా! లేదంటే మీరు ముక్కు నేలకు రాయాలి’’ అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మోదీ అబద్ధాలు మాట్లాడుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని నిలదీశారు. ఈసీ ఒక డమ్మీగా, బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డిని తిడితేనే టీవీల్లో చూపిస్తరని చెప్పి.. హరీశ్ రావు రేవంత్‌పైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కేసీఆర్ మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. కాకతీయ, ఉస్మానియా వర్సిటీలను ఆయన ఏనాడైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ఆవ వర్సిటీను సందర్శించాక తమను ప్రశ్నలు అడగాలన్నారు. బీజేపీ, కాంగ్రె్‌సలు పుట్టు శత్రువులంటూ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అని ఆయన అన్నారు.