Share News

Survey Drones: భూముల సర్వేకు డ్రోన్లు

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:54 AM

భూములను గొలుసులతో కొలవడం సంప్రదాయ పద్ధతి! దీనికి మనుషులు ఎక్కువే అవసరం. సమయమూ బాగానే పడుతుంది. ఎకరం-రెండకాలను కొలిచేందుకు గంటకు పైగా పడుతుంది.

Survey Drones: భూముల సర్వేకు డ్రోన్లు

  • ప్రత్యేక యాప్‌తో అనుసంధానం.. జియో ట్యాగింగ్‌తో ఫొటోలు

  • గంటలో 100 ఎకరాల దాకా కొలతలు

  • ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల రూపకల్పన

  • దేశంలో తొలి సర్వే డ్రోన్‌గా గుర్తించిన కేంద్ర సర్కారు

కంది, ఆగస్టు 7: భూములను గొలుసులతో కొలవడం సంప్రదాయ పద్ధతి! దీనికి మనుషులు ఎక్కువే అవసరం. సమయమూ బాగానే పడుతుంది. ఎకరం-రెండకాలను కొలిచేందుకు గంటకు పైగా పడుతుంది. డిజిటల్‌ యంత్రాలు వచ్చేశాయ్‌.. కాబట్టి మనుషులు తక్కువ అవసరం.. సమయమూ కొంత తగ్గింది! మరి.. ఒకే ఒక గంటలో 100 ఎకరాల భూమిని సర్వే చేయగలిగేలా వ్యవస్థ ఏదైనా అందుబాటులోకొస్తే? అద్భుతమే కదా! ఆ వ్యవస్థ వచ్చేసింది. అదే.. డ్రోన్లద్వారా భూ సర్వే పద్ధతి! సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పరిశోధకులు భూములను సర్వే చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను రూపొందించారు.


ఈ డ్రోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఐఐటీ-హెచ్‌లోని ఇంక్యూబేషన్‌ విభాగం అధికారులు క్రిస్టల్‌బాల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెంట్‌ పైవ్రేట్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించారు. ఈ డ్రోన్‌లను డీజీసీఏ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) అంగీకరించింది. భూముల సర్వేలో దీని పనితీరు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్లను సర్వే డ్రోన్లుగా గుర్తించింది. ఫలితంగా దేశంలోనే తొలి సర్వే డ్రోన్‌గా గుర్తింపు పొందింది. మోడల్‌-వీ పేరుతో తయారుచేసిన ఈ డ్రోన్లు సెకండ్‌కు 8 మీటర్లు ఎత్తుకు ఎగురుతాయి. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 50 నిమిషాల పాటు గాలిలోనే ఎగరగల సామర్థ్యంతో వీటిని తయారు చేశారు. భూ సర్వేపై రూపొందించిన ఓ ప్రత్యేక యాప్‌ను అనుసంధానం చేస్తే గాల్లోకి ఎగిరి జియో టాగింగ్‌తో ఫొటోలు తీసి సర్వే హద్దుల వివరాలను పక్కాగా వెల్లడిస్తుంది.


ఈ డ్రోన్ల తయారీ కోసం 32మంది ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఈ డ్రోన్లతో భూ సర్వేలు అత్యంత వేగంగా చేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. వీటితో పాఠశాల విద్యార్థులకు వివిధ రకాలుగా పాఠ్యాంశాలు కూడా బోధించవచ్చునని తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఇదే స్టార్టప్‌ కంపెనీ ద్వారా 100 డ్రోన్లను కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సర్వే డ్రోన్లు 300 వరకు అమ్ముడయ్యాయని తెలిసింది. అతి త్వరలోనే గాల్లో గంటసేపు ఎగిరే సామర్థ్యంతో పంట పొలాల్లో మందులు పిచికారి చేసే డ్రోన్లు, సర్వేలెల్స్‌ డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయని పరిశోధకులు వెల్లడించారు. మంగళవారం సంగారెడ్డి పరిధిలోని కందిలో ఈ డ్రోన్లను ఐఐటీ-హెచ్‌ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగులు గాల్లోకి ఎగరవేసి వాటి పనితీరును పరీక్షించారు.


  • డ్రోన్లతో సర్వే ఇలా..

భూ సర్వే కోసం తొలుత ఈ డ్రోన్‌లకు మొబైల్‌ ఫోన్‌లో ‘మిషన్‌ ప్లానర్‌’ లేదా ‘ల్యాండ్‌ మెజర్‌మెంట్‌’ యాప్‌లను అనుసంధానం చేయాలి. తర్వాత స్థలం యజమాని చూపించే భూమి హద్దులను బట్టి ఆ యాప్‌ ద్వారా ఒక బెంచ్‌ మార్కును గీస్తారు. ఆ యాప్‌లోని కేఎంఎల్‌ (కీహోల్‌ మార్కప్‌ లాంగ్వేజ్‌) ద్వారా హద్దులను గుర్తించి సర్వే చేయాలనుకున్న ప్రదేశాన్ని మొత్తం చతురస్రాకారంలో ఒక రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తారు. ఆ మ్యాప్‌తో డ్రోన్‌ని గాల్లోకి వదులుతారు.


కేఎంఎల్‌ ఆధారంగా ఆ డ్రోన్‌ తీసే ఫొటోలకు మిషన్‌ ప్లానర్‌ యాప్‌లో గూగుల్‌లోని సర్వే ప్రదేశం ఉన్న విలేజ్‌ మ్యాప్‌ను అనుసంధానం చేసి రిపోర్ట్‌ ఇస్తారు. ఈ సాంకేతికతతో గంటకు 100 ఎకరాలు సర్వే చేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డ్రోన్లతో భూముల సర్వేతో పాటు కొండలు, గుట్టలు, బురద ప్రాంతాలు, నీటి కుంటలు లాంటి ప్రదేశాల్లో సులువుగా కొలతలు తీయొచ్చు. డ్రోన్‌ కెమెరాల్లో వాడే కెమెరా మ్యాడ్యూల్‌ను బట్టి మైనింగ్‌లలో, పవర్‌ ప్లాంట్లు, రైల్వే ట్రాక్‌ కూడా సర్వే చేయొచ్చునని వారు తెలిపారు.

Updated Date - Aug 08 , 2024 | 04:54 AM