Share News

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

ABN , Publish Date - Sep 22 , 2024 | 04:06 AM

అతడో ఐఐటీ విద్యార్థి.. కానీ, మత్తుకు బానిసై ఉన్నత చదువులను వదిలేశాడు.. మరొకడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. రూ.లక్షల్లో జీతం.. కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చేజేతులా పోగొట్టుకున్నాడు.

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

  • వ్యసనానికి బానిసై.. చదువుకు దూరం

  • మత్తుకు అలవాటుపడి స్మగ్లరైన మరో టెకీ

  • వీరి నుంచి కొన్న 22 మందిపై కేసులు

  • అన్నవరం నుంచి హైదరాబాద్‌కు రవాణా

  • నలుగురి అరెస్టు.. సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అతడో ఐఐటీ విద్యార్థి.. కానీ, మత్తుకు బానిసై ఉన్నత చదువులను వదిలేశాడు.. మరొకడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. రూ.లక్షల్లో జీతం.. కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చేజేతులా పోగొట్టుకున్నాడు.. ఇంకొకడు లారీ డ్రైవర్‌.. సులభంగా డబ్బు సంపాదించాలని అక్రమ రవాణాకు తెగించాడు.. ఆఖరికి వేరే రాష్ట్రం కూలీ కూడా స్మగ్లర్‌గా మారాడు..! గంజాయికి లొంగిపోయి.. దాని అమ్మకాన్నే ఉపాధిగా మార్చుకున్న వీరంతా హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కారు. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పవన్‌ పేరొందిన ఐఐటీ విద్యార్థి. స్నేహితుల ద్వారా గంజాయికి అలవాటు పడ్డాడు. చదువును మధ్యలోనే ఆపేశాడు. ఎస్‌ఆర్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ నెల్లూరు జిల్లాకు చెందిన కొలి మణికంఠ చౌదరితో కలిసి గంజాయి విక్రయించసాగాడు.


ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ హాస్టల్‌పై దాడి చేసి పవన్‌, మణికంఠను అరెస్టు చేసింది. 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. 20 గ్రాముల గంజాయిని రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్లు తేలింది. నెల్లూరు జిల్లా అల్లంపాడు ప్రాంతానికి చెందిన లోకేష్‌.. హైదరాబాద్‌ మణికొండలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. లక్షకు పైనే జీతం వచ్చేది. అయితే, స్నేహితుల ద్వారా అలవాటైన గంజాయి వ్యసనంగా మారింది. విధులను నిర్లక్ష్యం చేయడంతో ఉద్యోగం పోయింది. దీంతో గంజాయి సరఫరాలో దిగాడు. కూకట్‌పల్లిలో ఉండే స్నేహితుడు శ్రీకాంత్‌ ద్వారా లోకేష్‌ సైతం స్మగ్లర్‌గా మారాడు. శ్రీకాంత్‌ వద్ద, ధూల్‌పేట నుంచి గంజాయి తెచ్చి తాను తీసుకుంటూ అమ్ముతున్నాడు. ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ పోలీసులు.. లోకేష్‌ ఇంటిపై దాడి చేసి 1.75 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శ్రీకాంత్‌నూ అరెస్టు చేశారు. వీరు కిలో గంజాయిని రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు ఎస్టీఎఫ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి తెలిపారు. కాగా, పవన్‌, లోకేష్‌ వద్ద గంజాయి కొన్న 22 మందిపై కేసులు నమోదు చేశారు.


  • అన్నవరం నుంచి హైదరాబాద్‌కు..

ఏపీలోని అన్నవరం నుంచి హైదరాబాద్‌కు హాష్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి 2.3 కేజీల హాష్‌ ఆయిల్‌ సహా.. రూ.21 లక్షల సరుకును స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేటకు చెందిన వటుల రంజిత్‌కుమార్‌ అలియాస్‌ నిఖిల్‌ డ్రైవర్‌. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు గంజాయి, హాష్‌ ఆయిల్‌ రవాణాను ఎంచుకున్నాడు. స్నేహితులు బొల్లం సాయి నితిన్‌, బచ్చు నరేంద్ర, బోయిన్‌పల్లి సాయికృష్ణ, వినీత్‌తో ముఠా ఏర్పాటు చేశాడు. వీరంతా విశాఖ వెళ్లి సాయి అనే వ్యక్తి వద్ద హాష్‌ ఆయిల్‌ను కొని హైదరాబాద్‌కు తరలిస్తారు. కొంత కెమికల్‌ చేర్చి 5 ఎంఎల్‌, 10 ఎంఎల్‌గా సీసాల్లో నింపుతారు. 5 ఎంల్‌ను రూ.2-3 వేలకు విక్రయిస్తారు. రూ.లక్ష ఖర్చుతో రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు. కాగా, ఫిబ్రవరిలో సరూర్‌గర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు.


బయటకు వచ్చిన అనంతరం ఈ నెల 16న వినీత్‌ మినహా.. మిగిలిన నలుగురు అన్నవరం వెళ్లారు. సాయి నుంచి 2.7 కేజీల హాష్‌ ఆయిల్‌ను కొని హైదరాబాద్‌లోని నితిన్‌ ఇంట్లో దాచిపెట్టారు. ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌ పర్యవేక్షణలో ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌రెడి, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు బృందంతో కలిసి దాడి చేసి 2700 గ్రాముల హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన సంతో్‌షకుమార్‌ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చాడు. కేబుల్‌ వైర్‌ బిగించే కూలీగా పనిచేస్తున్నాడు. తనతో పనిచేస్తున్న కూలీలకు గంజాయి అలవాటు ఉండడంతో.. సంతో్‌షకుమార్‌ బిహార్‌లో సులభంగా దొరికే గంజాయి చాక్లెట్స్‌ను తెచ్చి విక్రయిస్తున్నాడు. ఒక్కో చాక్లెట్‌ను రూ.30 నుంచి 50కు అమ్ముత్తున్నాడు. మహేశ్వరం ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బృందం, ఆదిభట్ల పోలీసులతో కలిసి నిందితుడిని అరెస్టు చేసింది. గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది.

Updated Date - Sep 22 , 2024 | 04:06 AM