Telangana: బయటకు వెళ్లాలంటే భయపడుతున్న జనం.. తప్పించుకోవడం కష్టమే
ABN , Publish Date - Dec 12 , 2024 | 08:57 AM
బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. పగటిపూట ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోవడం కష్టంగానే ఉంది.
బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. పగటిపూట ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోవడం కష్టంగానే ఉంది. మిట్ట మధ్యాహ్నం కూడా కొన్ని చోట్ల భానుడి ధగధగలు కనిపించడం లేదు. సాయంత్రమైతే చాలు.. స్వెటర్లు లేకుండా బయట తిరగలేని పరిస్థితి. తెలంగాణలో పంజా విసురుతోంది చలి పులి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. తెలంగాణకు చలి ముప్పు ఉందని చెబుతున్నారు.
వాళ్లకు అలర్ట్
బలపడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వర్షాలు, తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే స్టేట్‌లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కిందకు పడిపోతున్నాయి. బుధవారం మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ పడిపోయాయి. దీంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేందుకు కూడా జనాలు వణికిపోతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అక్కడ దండిగా వానలు
తెలంగాణకు చలితో పాటు వర్షం భయం కూడా పట్టుకుంది. అసలే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో అందరూ వణుకుతున్నారు. అయితే అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని చోట్ల చిరు జల్లులు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కానీ ఎలాంటి వర్షం హెచ్చరికలు లేవని స్పష్టం చేశారు. కాగా, అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.