Warangal: వేట కత్తితో నరికేశాడు..
ABN , Publish Date - Jul 12 , 2024 | 03:14 AM
వరంగల్ జిల్లా లో దారుణం జరిగింది. ఓ యువతి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. ఆ యువతి పెళ్లాడిన యువకుడే వేటకత్తితో దాడి చేసి వారి ప్రాణాలు తీశాడు.
వరంగల్ జిల్లాలో దంపతుల దారుణ హత్య.. తల్లిదండ్రుల ప్రాణం తీసిన కూతురి ప్రేమపెళ్లి వ్యవహారం
తమను విడదీశారని యువతి కుటుంబంపై ఆమె భర్త కక్ష
భార్య, ఆమె సోదరుడికి కత్తిపోట్లు
చెన్నారావుపేట, జూలై 11: వరంగల్ జిల్లా లో దారుణం జరిగింది. ఓ యువతి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. ఆ యువతి పెళ్లాడిన యువకుడే వేటకత్తితో దాడి చేసి వారి ప్రాణాలు తీశాడు. తన భార్యను తనకు దూరం చేశారనే కక్షతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల్ తండాలో జరిగిన ఈ ఘటనలో బానోతు శ్రీనివాస్ (40) బానోతు సుగుణ(35) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పదహారు చింతల్‌తండాకు చెందిన బానోతు శ్రీనివాస్, సుగుణ దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. దీపిక హన్మకొండలో డిగ్రీ సెకండియర్ చదువుతుండగా, మదన్‌లాల్ అమీనాబాద్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇక, గీసుకొండ మండలం కొమ్మాలకు చెందిన మేకల నాగరాజు(బన్ని) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.
దీపక పాఠశాలలో చదువుకునే రోజుల్లో నాగరాజు ఆటోలో ప్రయాణించేది. ఈ క్రమంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీలో చేరిన దీపిక అక్కడే ఓ హాస్టల్‌లో ఉండేది. అయితే, గతేడాది నవంబరులో తల్లిదండ్రులకు తెలియకుండా హైదరాబాద్ వెళ్లిన దీపిక, నాగరాజును రహస్యంగా పెళ్లి చేసుకుంది. అనంతరం నాగరాజు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లోనే ఉండేది. అయితే, పెళ్లి జరిగిన వారం రోజులకు.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన దీపిక.. తన పెళ్లి విషయాన్ని చెప్పింది. దీంతో హైదరాబాద్ వెళ్లి సుగుణ కూతురికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం వీరి ప్రేమ, పెళ్లి విషయంలో దీపిక తల్లిదండ్రులు, నాగరాజు పోలీసుస్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకోగా ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు పెద్దల సమక్షంలో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
దీపిక, నాగరాజు విడివిడిగా ఉండాలని పెద్దలు తీర్మానించగా ఇరుకుటుంబాలు అంగీకరించాయి. దీంతో హైదరాబాద్ వెళ్లిపోయిన నాగరాజు.. దీపిక తనకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేక ఆమె తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. కొద్దిరోజుల క్రితం దీపిక ఇంటి వద్ద రెక్కీ కూడా చేశాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల(తెల్లారితే గురువారం) సమయంలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులను చూసి వెంట తెచ్చుకున్న వేటకత్తితో దాడి చేశాడు. తొలుత సుగుణ, శ్రీనివాస్, ఆ తర్వాత దీపికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారి కేకలు విని ఇంట్లో నుంచి బయటికొచ్చిన దీపిక సోదరుడు మదన్‌లాల్‌పై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మరణించింది. ఇక, తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీపిక, మదన్‌లాల్ హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, హత్యల అనంతరం గుండెంగలోని ఓ పాఠశాలకు చేరుకున్న నాగరాజు కత్తితో తన చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు.