Application Process: ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో సమస్యల ముళ్లు!
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:17 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
సర్వర్ డౌన్‌తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలు
పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా పనే చేయదు
ముందుకుసాగని దరఖాస్తుల పరిశీలన
31 నాటికి పూర్తవడం కష్టమే జనవరి 10 దాకా కొనసాగే అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వర్ డౌన్ అవడంతో పాటు మెయింటెనెన్స్, ప్రాబ్లమ్, నో ఇంటర్‌నెట్ కనెక్షన్, చెక్ యువర్ మొబైల్ డేటా అనే ఎర్రర్లతో యాప్ నిలిచిపోతోంది. ఫలితంగా గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముందుకుసాగడంలేదు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాప్ పనిచేయడంలేదు. ఫలితంగా సర్వే మరింత ఆలస్యమవుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడైనా గ్రామాలు, మూరుమాల ప్రాంతాలు, ఏజెన్సీ తండాలు, ఆవాసాల్లో ఆన్‌లైన్ అందుబాటులో లేకపోయినా కూడా యాప్ పనిచేస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకోసం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుదారు వివరాలను తీసుకుని, ఫొటోలు సేకరించి ఇంటర్‌నెట్‌తో అనుసంధానమయ్యాక ఆన్‌లైన్ విధానంలో ఆ వివరాలను యాప్‌లో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పారు.
క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆ వివరాలను నమోదుచేయడానికి యాప్ సహకరించడం లేదు. కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మంతోగు, పగిడేరు అనే ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ కనెక్షన్ లేదు. అక్కడి దరఖాస్తుదారుల వివరాలను ఆఫ్‌లైన్‌లో తీసుకుని, ఆన్‌లైన్ ద్వారా యాప్‌లో నమోదుచేయడానికి పది రోజుల సమయం పట్టింది. పది రోజుల్లో వంద దరఖాస్తులను మాత్రమే ఈ విధానంలో చేయగలిగామని, దీని ప్రకారం సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 31నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, సంక్రాంతినాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 10వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియే కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జిల్లాల కలెక్టర్లు కూడా సమస్యను పరిగణనలోకి తీసుకుని జనవరి 5 వరకైనా పూర్తయ్యేలా చూడాలంటూ సిబ్బందికి సూచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు డిసెంబరులో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 80.50లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 69,83,895 దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులొచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా, యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో సిబ్బంది సతమతమవుతన్నారు.