Share News

Jagga Reddy: రాహుల్‌గాంధీ దేవుడిని మొక్కినా.. ప్రచారం చేసుకోరు

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:59 AM

‘‘రాహుల్‌గాంధీ ప్రతి రోజూ ఇంట్లో దేవుడికి మొక్కినా.. ఫొటోలు తీయించుకుని ప్రచారం చేసుకోరు. మోదీ, అమిత్‌షాలు మాత్రం దేవుడిని మొక్కినప్పుడు ఫొటోలు తీయించుకుని మరీ ప్రచారం చేసుకుంటారు.

Jagga Reddy: రాహుల్‌గాంధీ దేవుడిని మొక్కినా.. ప్రచారం చేసుకోరు

మోదీ, అమిత్‌షాలు పబ్లిసిటీ చేసుకుంటారు.. రాహుల్‌కు, వారికి ఉన్న తేడాను గమనించాలి

  • రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతను అంబేడ్కర్‌కు ఇచ్చింది నెహ్రూనే

  • బీజేపీ నేతలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు

  • ఆ రాజ్యాంగమే.. ప్రజలకు రక్షణ కవచం

  • దాని వల్లే మోదీ,షాలకు పదవులు దక్కాయి

  • అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది

  • నెహ్రూ ముని మనవడిగా రాహుల్‌.. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకున్నారు

  • అమిత్‌షా క్షమాపణ చెప్పే వరకూ పోరాటం ఆగదు

  • ఆయన ఏ పిలుపు ఇచ్చినా అమలు చేసేందుకు మేము సిద్ధం

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘రాహుల్‌గాంధీ ప్రతి రోజూ ఇంట్లో దేవుడికి మొక్కినా.. ఫొటోలు తీయించుకుని ప్రచారం చేసుకోరు. మోదీ, అమిత్‌షాలు మాత్రం దేవుడిని మొక్కినప్పుడు ఫొటోలు తీయించుకుని మరీ ప్రచారం చేసుకుంటారు. రాహుల్‌కు, వారికి ఉన్న తేడా ఇదే. ప్రజలు దీన్ని గమనించాలి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. భగవంతుడు, రాజ్యాంగం వేర్వేరు అంశాలని, ఈ మాత్రం జ్ఞానం అమిత్‌షా, బీజేపీకి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. దేవుడిని ఎవరి మనసులో వారు మొక్కుకుంటారని, పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. దేవుడి పేరు చెప్పుకుని బతికే బీజేపీ నేతలకు ఈ ఆలోచన లేక పోవడం బాధాకరమన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు జగ్గారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానించడంపై రాహుల్‌గాంధీ గళం ఎత్తితే, ఆయనపై బీజేపీ ఎంపీలు దాడికి పాల్పడడాన్ని టీపీసీసీ తరఫున ఖండించారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక ధైర్యం.. రక్షణ కవచమన్నారు.


దాని వల్లే దేశంలోని ప్రజలకు హక్కులు అమలవుతున్నాయని, న్యాయం అందుతుందని, కులం- మతం అనే తేడాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యారన్నా.. అమిత్‌షా కేంద్ర హోం మంత్రి అయ్యారన్నా ఆ రాజ్యాంగం వల్లేనని చెప్పారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌కు రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యత ఇచ్చింది.. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూనే అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. నిన్న, మొన్న పుట్టిన బీజేపీ నేతలు.. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంటే.. నెహ్రూ మునిమనుమడిగా కాపాడే బాధ్యతను రాహుల్‌గాంధీ తీసుకున్నారన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడే రాహుల్‌గాంధీని.. రాజకీయ కుట్రతో గత ఏడాదంతా పార్లమెంటుకు రాకుండా చేశారని, ఇప్పుడు కూడా ఆయన పార్లమెంటుకు రాకుండా దాడి చేసి అడ్డుకుంటున్నారన్నారు. అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానించారని, ఆయన క్షమాపణలు చెప్పేదాకా రాహుల్‌గాంధీ పోరాటం ఆగదని అన్నారు. ఈ యుద్దంలో రాహుల్‌గాంధీ ఏ పిలుపు ఇచ్చినా అమలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలుగా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 03:59 AM