Share News

Jaggareddy : అబద్ధాలకు తల్లిగారిల్లు, అత్తగారిల్లు కేసీఆర్‌దే

ABN , Publish Date - Aug 07 , 2024 | 04:20 AM

అబద్ధాలకు అత్తగారిల్లు.. తల్లిగారిల్లూ కేసీఆర్‌దేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో రైతులకు రూ.2 లక్షల మేరు రుణమాఫీ చేసిన కేసీఆర్‌.. దానికి ఏకంగా 8 కిస్తీలు తీసుకున్నారని పేర్కొన్నారు.

Jaggareddy : అబద్ధాలకు తల్లిగారిల్లు, అత్తగారిల్లు కేసీఆర్‌దే

  • రేవంత్‌ హయాంలో హుందాగా అసెంబ్లీ .. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిందే ఎక్కువ

  • కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పౌరుషం ఉంటే.. ఐటీఐఆర్‌ మంజూరు చేయించండి

  • మూసీ ప్రక్షాళన అవినీతి కోసమైతే.. గంగా ప్రక్షాళనా అందుకేనా?

  • బీజేపీ నేతలు కోతల రాయుళ్లు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అబద్ధాలకు అత్తగారిల్లు.. తల్లిగారిల్లూ కేసీఆర్‌దేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో రైతులకు రూ.2 లక్షల మేరు రుణమాఫీ చేసిన కేసీఆర్‌.. దానికి ఏకంగా 8 కిస్తీలు తీసుకున్నారని పేర్కొన్నారు. అదే రూ.2 లక్షల మేరకు రైతు రుణమాఫీని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 8 నెలల్లో ఒకటే దఫాలో చేసిందని కొనియాడారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

కాంగ్రె్‌సకు ప్రజలు అధికారం ఇచ్చి 8 నెలలు గడవకుండానే ఇచ్చిన హామీ మేరకు పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ సహా సీనియర్‌ మంత్రుల నాయకత్వంలో పాలన సాఫీగా సాగుతోందన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడుస్తున్నాయంటూ కితాబునిచ్చారు.

కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. ఒక సందర్భంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలనే రద్దు చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక 8 నెలల్లో మూడు సార్లు శాసనసభ సమావేశమైందని, 30 రోజుల పాటు సభ జరిగితే కేసీఆర్‌ ఒకే ఒక్క రోజు హాజరయ్యారన్నారు. సభలో మాట్లాడేందుకు అధికార పార్టీ సభ్యుల కంటే.. హరీశ్‌రావు, కేటీఆర్‌ సహా ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ సమయం ఇచ్చారని తెలిపారు. మాట్లాడేందుకు స్వేచ్ఛను ఇస్తున్నా.. ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా నిందలు వేస్తూనే ఉన్నారన్నారు.


మూసీని ప్రక్షాళన చేయాలా.. వద్దా?

‘‘మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే డబ్బుల కోసమే చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నరు. అలా అయితే.. ప్రధాని మోదీ గంగానది ప్రక్షాళన చేపట్టిందీ అవినీతి కోసమేనా? మూసీ ప్రక్షాళన చేయకుంటే పట్టించుకోవట్లేదంటరు. ఏం చేయాలి మరి? మూసీని ప్రక్షాళన చేయమంటరా.. వద్దంటరా? వద్దూ అంటే ఆ మేరకు పార్టీలో తీర్మానం చేసి చెప్పండి’’ అంటూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను నిలదీశారు.

గంగానది ప్రక్షాళన అవినీతి కోసమేనంటూ ఏనాడైనా రాహుల్‌గాంధీ గానీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు కానీ ఆరోపణలు చేశారా అని నిలదీశారు. ఈ మాత్రం జ్ఞానం, హుందాతనం బీజేపీ నేతలకు లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ నేతల వద్ద మాటలే తప్ప చేతలు లేవని, ఆ పార్టీ నేతలు కోతల రాయుళ్లు అని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలో సచివాలయం కళకళలాడుతోందని, సీఎం, మంత్రులు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని కలుస్తూ.. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబులు.. వివిధ కంపెనీల యాజమాన్యాలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారన్నారు.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పౌరుషం ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో రైతు రుణమాఫీ ఫైళ్లకు బూజు పట్టిపోయిందని, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వాటిని దులుపుతున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా జగ్గారెడ్డి చెప్పారు.

Updated Date - Aug 07 , 2024 | 04:20 AM