JNTU: కంప్యూటర్ సైన్స్ బోధనకు వారూ అర్హులే!
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:06 AM
కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్ ఇతర బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.
వేరే బ్రాంచ్ అధ్యాపకులకు బోధన అవకాశం
ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 10ు మందికి అనుమతి
హైదరాబాద్ సిటీ, ఆగష్టు 14(ఆంధ్రజ్యోతి): కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్ ఇతర బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. గతేడాది వరకు సర్క్యూటెడ్ బ్రాంచ్‌లైన ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ ప్రొఫెసర్లకు మాత్రమే ఉన్న ఈ వెసులుబాటును తాజాగా నాన్-సర్క్యూటెడ్ బ్రాంచ్‌ల ప్రొఫెసర్లకు కల్పిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. నాన్ సర్క్యూటెడ్ బ్రాంచ్‌లకు చెందిన పలువురు ప్రొఫెసర్ల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. సివిల్, మెకానికల్, మెటలర్జికల్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్ బ్రాంచ్‌ల ప్రొఫెసర్లను కంప్యూటర్ సైన్స్ బోధనకు వినియోగించుకోవచ్చు. అయితే సదరు నాన్ సర్క్యూటెడ్ బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు 10 క్రెడిట్స్ కలిగిన కంప్యూటర్ సైన్స్ సంబంధిత(ఎన్‌పీటీఈఎల్/స్వయం,తదితర) సర్టిఫికెట్ కోర్సులను అభ్యసించి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కంప్యూటర్ సైన్స్ బోధనకు నాన్ సర్క్యూటెడ్ బ్రాంచ్‌ల ప్రొఫెసర్లను 10 శాతం మందినే మాత్రమే అనుమతించాలని కళాశాలల యాజమాన్యాలకు షరతు విధించారు. అయితే బీటెక్, ఎంటెక్‌లో నాన్ సర్క్యూటెడ్ మెకానికల్, మెటలర్జికల్, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారిని కంప్యూటర్ సైన్స్ బోధనకు వినియోగించడంపై సర్క్యూటెడ్ బ్రాంచ్‌ల ప్రొఫెసర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.