Share News

JNTU: ఖమ్మం, మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీల్లో నిండని సీట్లు

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:50 AM

జేఎన్‌టీయూ కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

JNTU: ఖమ్మం, మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీల్లో నిండని సీట్లు

  • రెండు కాలేజీల్లో సరైన వసతుల్లేక విద్యార్థుల్లో అనాసక్తి

  • కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా కాలేజీల్లో పరిస్థితులను చూసి వేరే కాలేజీల వైపు మొగ్గు.. భారీగా సీట్లు ఖాళీ

  • ఏడాది క్రితం ఆర్భాటంగా ఈ రెండు కాలేజీల ప్రారంభం

  • తాత్కాలిక భవనాల్లో, తాత్కాలిక సిబ్బందితో తరగతులు

ఖమ్మం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జేఎన్‌టీయూ కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కౌన్సెలింగ్‌ సమయంలో ఈ కాలేజీలకు వెబ్‌ ఆప్షన్లు పెట్టి, సీట్లు పొందిన విద్యార్థులు, ఆయా కాలేజీలకు వెళ్లాక అక్కడి పరిస్థితులను చూసి మనసు మార్చుకుంటున్నారు. తర్వాతి దశల కౌన్సెలింగ్‌లో వేరే కాలేజీలను ఎంచుకుంటున్నారు.


ఈ రెండు కాలేజీల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు కారణం. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ రెండు కాలేజీలను ప్రారంభించారు. శాశ్వత భవనాలను ఏర్పాటు చేయలేదు. నిధులను కూడా కేటాయించలేదు. ఖమ్మం జిల్లా కేంద్రానికి మంజూరైన ఇంజనీరింగ్‌ కాలేజీని పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఐటీడీఏ ఒకేషనల్‌ భవనంలో, మహబూబాబాద్‌ కాలేజీని అక్కడి పాత కలెక్టరేట్‌ భవనంలో ఏర్పాటు చేశారు. అప్పటికే ఎంసెట్‌ 3విడతల కౌన్సెలింగ్‌ పూర్తి కావడంతో నాలుగో విడత స్పెషల్‌ కౌన్సెలింగ్‌లో సీఎ్‌సఈ, డేటా సైన్స్‌ కోర్సులను మాత్రమే ప్రారంభించారు. పాలేరులో 48మంది, మహబూబాబాద్‌లో 42మందితో విద్యాసంవత్సరం ప్రారంభించారు. తాత్కాలిక సిబ్బందితోనే విద్యాబోధన జరగుతోంది.


  • రెండు కాలేజీల్లోనూ వందకు పైగా సీట్లు ఖాళీ

ఈ ఏడాది ఈ రెండు కాలేజీల్లోనూ కోర్సులను పెంచారు. పాలేరు జేఎన్‌టీయూలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎ్‌సఈలో 66 సీట్లకు 66 మంది, ఈసీఈలో 66కి 60మంది, డేటాసైన్స్‌లో 66 సీట్లకు65, ట్రిపుల్‌ ఈలో 66కి 28మంది, మెకానికల్‌లో 66కి 11మంది చొప్పున మొత్తం 330సీట్లకు గాను 230మంది సీట్లు పొందారు. అయితే సీట్లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రిపోర్టింగ్‌ కోసం కాలేజీలకు వచ్చాక సరైన సౌకర్యాలు, పర్మినెంట్‌ ఫ్యాకల్టీ, ల్యాబులు లేవని తెలుసుకొని తర్వాతి దశల కౌన్సెలింగ్‌లో వేరే కాలేజీలను ఎంచుకున్నారు. దీంతో ఈ కాలేజీలో 143 మంది మాత్రమే చేరారు. మహబూబాబాద్‌ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగు కోర్సుల్లో మొత్తం 260 సీట్లకు గాను 126 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

Updated Date - Aug 27 , 2024 | 04:50 AM