Share News

JNTU: జేఎన్‌టీయూలో డిజిలాకర్‌ వ్యవస్థ!

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:53 AM

చేతిలో ఫైళ్లు, వాటిలో తమ విద్యాభ్యాసానికి సంబంధించిన బోలెడన్ని సర్టిఫికెట్లతో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు వెళ్తుంటారు. అయితే త్వరలోనే ఈ తరహా (ఫిజికల్‌ సర్టిఫికెట్ల) విధానానికి స్వస్తి పలికేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) సిద్ధమవుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో డిజిలాకర్‌ వ్యవస్థ!

  • వర్సిటీ ఉన్నతాధికారులతో డిజిటల్‌ ఇండియా ప్రతినిధుల భేటీ

  • ఫిజికల్‌ సర్టిఫికెట్ల విధానానికి చెల్లు!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేతిలో ఫైళ్లు, వాటిలో తమ విద్యాభ్యాసానికి సంబంధించిన బోలెడన్ని సర్టిఫికెట్లతో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు వెళ్తుంటారు. అయితే త్వరలోనే ఈ తరహా (ఫిజికల్‌ సర్టిఫికెట్ల) విధానానికి స్వస్తి పలికేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) సిద్ధమవుతోంది. దేశ ంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను డిజిటలైజ్‌ చేయడంలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన డిజిటల్‌ ఇండియా ప్రతినిధులు తాజాగా జేఎన్‌టీయూకు వచ్చారు. వర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ సుప్రీతి, నాగరత్న తదితరులతో డిజిటల్‌ ఇండియా ప్రతినిధులు కశ్యప్‌, గౌరవ్‌ భేటీ అయ్యారు.


వచ్చే డిసెంబరులోగా డిజిలాకర్‌ వ్యవస్థను జేఎన్‌టీయూ అనుబంధ, అఫిలియేటెడ్‌ కళాశాలల్లో అమలుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డిజిలాకర్‌ విధానంతో ఇకపై వివిధ సంస్థల్లో ఉద్యోగాలు, అడ్మిషన్ల కోసం వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల విద్యా సంస్థల్లో సర్టిఫికెట్ల ముద్రణకు అయ్యే వ్యయప్రయాసలను నివారించవచ్చన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, నిర్ధారణ కోసం ఆయా సంస్థలు తమకు పంపుతున్నాయని ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిజిలాకర్‌ వ్యవస్థ అమలైతే వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ బుర్రా వెంకటేశం సూచనల మేరకు డిజిలాకర్‌ విధానాన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలో వీలైనంత త్వరగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 08 , 2024 | 03:53 AM