job security: కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది వెట్టి
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:55 AM
బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది.
చాలీ చాలని వేతనాలు.. ఉద్యోగ భద్రత కరువు.. 15 ఏళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం
సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్
పెద్దపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నా.. ఉద్యోగులకు మాత్రం వెట్టిచాకిరీ తప్పడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. అక్షరాస్యతలో బాలికలు వెనుకబడ్డ మండలాలను గుర్తించి ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ తరహాలో విద్యను అందిస్తున్నారు.
తొలుత ఈ విద్యాలయాల్లో తెలుగు మీడియంలోనే బోఽధించినప్పటికీ, క్రమంగా అన్ని విద్యాలయాలను ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో 283 విద్యాలయాలు ఇంటర్ విద్య వరకు అప్‌గ్రేడ్ కాగా, మరో 192 విద్యాలయాలు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంది. పదవ తరగతి వరకు 99,423 మంది, ఇంటర్మీడియట్‌లో 24,730 మంది కలిపి మొత్తం 1,24,153 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఈ విద్యాలయాల్లో 7,398 మంది ఉపాధ్యాయులు, 5,983 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. అప్పట్లో టీచింగ్ సిబ్బందిని రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా నియమించగా, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించారు. 2009-10 నుంచి 2010-11 విద్యా సంవత్సరం వరకు ఈ విద్యాలయాలను ప్రత్యేక సోసైటీల ద్వారా నిర్వహించగా, 2011-12 విద్యా సంవత్సరం నుంచి సర్వ శిక్ష ప్రాజెక్టు ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కస్తూర్బా విద్యాలయాల నిర్వహణకు 536.16 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.320.49 కోట్లు వెచ్చించాల్సి ఉంది.
అరకొర వేతనాలతో ఇబ్బందులు..
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేసే ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి అతి తక్కువ వేతనాలు అందుతున్నాయి. గురుకులం నిర్వహణను చూసుకునే స్పెషల్ ఆఫీసర్‌కు రూ.32,500, పీజీ సీఆర్‌టీలకు రూ.29,900, సీఆర్‌టీలకు రూ.26,000, పీఈటీలకు రూ.15,600, అకౌంటెంట్, ఏఎన్‌ఎంలకు రూ.14,300, అటెండర్, డే, నైట్ వాచ్‌మెన్, కుక్‌లకు రూ.9,750 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది కంటే రెట్టింపు సేవలను అందిస్తున్నా.. వారికి కనీస వేతనాలు సైతం అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతన స్కేల్, సర్వీస్ రూల్స్, సెలవులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇక.. ప్రతి సీఆర్‌టీ నెలలో రెండు సార్లు నైట్ డ్యూటీ నిర్వహించాల్సి వస్తుంది. ఉదయం పూట విధులకు వెళ్లిన వారు.. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు.. కస్తూర్బా సిబ్బందిని సెక్టోరల్ అధికారులు చులకనగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని వారు మొర పెట్టుకుంటున్నా.. ఆలకించే వారు కరువయ్యారు. సెర్ప్, జూనియర్ కాలేజీల్లో ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం.. కస్తూర్బా ఉద్యోగులను మాత్రం గాలికి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు.