Kaleshwaram Project: 16న రాష్ట్రానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:27 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణలో భాగంగా ఈనెల 16వ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారు. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి, విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు.
20 రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం
కాళేశ్వరం అవకతవకలపై విచారణ
ఆయన వేతన చెల్లింపుల ఫైలు కదలని వైనం
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంఽధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణలో భాగంగా ఈనెల 16వ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారు. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి, విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు. విచారణలో ఇప్పటికే పలు కీలక దశలు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణాలు, సబ్ కాంట్రాక్ట్‌లు, డిజైన్‌లు, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణంపై విచారణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం కీలకమైన ఆర్థికంగా అవకతవకలు ఏమైనా జరిగాయా? వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. దీనికోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో సంబంధం లేని చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)ను సమకూర్చాలని ఆయన ప్రభుత్వాన్ని ఇదివరకే కోరారు.
దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి కే ఐఏఎ్‌సలతో పాటు మాజీ ఐఏఎ్‌సలు, మాజీ సీఎ్‌సలను కమిషన్ విచారించింది. వారితో పాటు ఇంజనీర్లు/నిపుణులు దాఖలు చేసిన అఫిడవిట్లను కోల్‌కతాకు తెప్పించుకొని, అధ్యయనం చేసిన ఆయన...తదుపరి సమన్ల జారీ, క్రాస్ ఎగ్జామినేషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఎవరెవరినీ పిలవాలనే దానిపై ఆయన ఈ దఫా నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలు, బెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదులను సమకూర్చాలని కోరినా...ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.
కాగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌కు మూడునెలల వేతనాల చెల్లింపుల ఫైలు అడుగు ముందుకు కదల్లేదు. ఈ ఫైలును ఆమోదించే విషయంలో ఆర్థిక శాఖ ఏ నిర్ణయం తీసుకోలేదు. గురువారం నీటిపారుదల శాఖ అధికారులు పలు దఫాలుగా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. మూడునెలలుగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘో్‌షతోపాటు ఆయన కార్యదర్శి, కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్లకు వేతనాలు ఇవ్వలేదు. ఈనెల 16న జస్టిస్ చంద్రఘోష్ రానుండటంతో ఈలోగా వేతనాల ఫైలుకు ఆమోదం తీసుకొని, చెల్లింపులు చేయడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నాలు చేస్తోంది.