Share News

Kaleshwaram Project: నేడు హైదరాబాద్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:51 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ దఫా రెండు వారాల పాటు ఇక్కడే ఉండి, విచారణను వేగిరం చేయనున్నారు.

Kaleshwaram Project: నేడు హైదరాబాద్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌

హైదరాబాద్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ దఫా రెండు వారాల పాటు ఇక్కడే ఉండి, విచారణను వేగిరం చేయనున్నారు. రాగానే.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ నివేదికను పదే పదే కోరినా ఇవ్వనందుకు గాను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(వీ అండ్‌ ఈ) డైరెక్టర్‌ జనరల్‌తో పాటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనందుకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్‌కు సమన్లు జారీ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.


ఆయా సంస్థలు నివేదికలు అందించాలని ఇప్పటికే పలు దఫాలుగా ఆయన కోరినా ప్రయోజనం లేదు. దాంతో వారిని పిలిపించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా అఫిడవిట్లు దాఖలు చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారులతో పాటు సర్వీసులో ఉన్న సీనియర్‌ ఐఏఎ్‌సలను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే ప్రక్రియ ముందుకు కదలనుంది. ఈ క్రమంలో బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై కూడా ఈ దఫా గురిపెట్టనున్నారు. మూడు ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌ కాంట్రాక్టర్లు ఉన్నట్లు ఇది వరకే ఆయన గుర్తించారు.


ప్రధాన కాంట్రాక్టర్లకు ఏ మేరకు చెల్లింపులు జరిగాయి..? అందులో సబ్‌ కాంట్రాక్టర్లకు అందినదెంత..? వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. మరోవైపు జస్టిస్‌ చంద్రఘోష్‌ పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. అయితే విచారణ నివేదికను అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. తొలుత వేసిన కమిషన్‌ గడువు జూన్‌ 30తో ముగియగా.. రెండు నెలలు పొడిగిస్తూ అవకాశం ఇచ్చారు. తాజాగా మరో రెండు నెలలు కమిషన్‌ను గడువును పొడిగించే అవకాశాలున్నాయి.


  • ఎట్టకేలకు అందిన వేతనం..

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ వేతనానికి సంబంధించిన బిల్లులను ఎట్టకేలకు ఆర్థిక శాఖ క్లియర్‌ చేసింది. దాంతో మే, జూన్‌, జూలై వేతనాలతో పాటు భత్యాన్ని ఆయన ఖాతాలో జమ చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 03:51 AM