Share News

Siddipet: కవులు, రచయితలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:13 AM

కవులు, రచయితలు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన సమయం వచ్చిందని, సాహితీవేత్తలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రముఖ సాహితీవేత్త, ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు.

Siddipet: కవులు, రచయితలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి

  • సాహితీ సంఘాలు పార్టీలకు అనుబంధంగా ఉండొద్దు

  • ‘మరసం’ వార్షికోత్సవంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

సిద్దిపేట కల్చరల్‌, సెప్టెంబరు 29 : కవులు, రచయితలు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన సమయం వచ్చిందని, సాహితీవేత్తలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రముఖ సాహితీవేత్త, ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ‘మరసం’ (మంజీర రచయితల సంఘం) 38వ వార్షికోత్సవ సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాహిత్య సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా కొనసాగకూడదని అన్నారు. కవులు, రచయితలు ప్రశ్నించేలా ఉండాలని, ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. సాహిత్యం కొత్త కర్తవ్యాలను ఎంచుకోవాలని.. మేల్కొంటూ మేల్కోలపాలని అభిప్రాయపడ్డారు.


2014 తర్వాత తెలంగాణ ఉద్యమ సమాజం కకావికలం అయిందని సాహిత్యకారుల్లో అనిశ్చితి నెలకొందని అన్నారు. కవులు, రచయితలు, సమాజానికి మార్గదర్శకం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. మంజీర రచయితల సంఘంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉపనదిలా ప్రారంభమై మహా సముద్రంలా విస్తరించిన మరసం ప్రస్తుత సమయంలో మళ్లీ ఉపనదిగా తన ప్రవాహాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోరాట అవసరాన్ని 1997లో గుర్తించిన మరసంనకు మరోసారి ప్రజల్లో చైతన్యాన్ని తేవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా ‘మూడు గుడిసెల పల్లె’ అనే కవితా సంకలనాన్ని కె.శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. కార్యకమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్‌, రసమయి బాలకిషన్‌, జర్నలిస్టు విరాహత్‌ అలీ, మరసం జిల్లా అధ్యక్షుడు రంగాచారి పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 04:13 AM