Share News

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ విచారణ గడువు పెంపు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:36 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం.

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ విచారణ గడువు పెంపు..

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం... ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం జీవో నెం.14 జారీ చేశారు. మరోవైపు జూలై మొదటి వారంలో తదుపరి విచారణ ప్రక్రియను చేపట్టడానికి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ హైదరాబాద్‌ రానున్నారు.


ఈ దఫా అఫిడవిట్లన్నీ పరిశీలించి, వాటిలోని అంశాల ఆధారంగా నోటీసులు జారీచేసి, వారిని విచారణకు పిలవనున్నారు. మరోవైపు ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పూర్తిస్థాయి నివేదికను కూడా తెప్పించుకోనుంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) పూర్తి నివేదిక కూడా జూలై 7వ తేదీకల్లా ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వచ్చాయి. దాంతో ఈ దఫా విచారణ ప్రక్రియ అత్యంత కీలకం కానుంది.


వెలువడని ‘విద్యుత్‌ విచారణ’ పొడిగింపు జీవో

గత ప్రభుత్వం ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాలను నామినేషన్‌ పద్ధతిపై అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌తో విచారణ జరిపిస్తున్న విషయం విదితమే. ఈ కమిషన్‌ గడువు కూడా ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. గడువును నెల రోజులు పొడిగించాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి చేరినప్పటికీ జీవో మాత్రం వెలువడలేదు. మరోవైపు కమిషన్‌ విచారణను సవాల్‌ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 30 , 2024 | 04:36 AM