Critical Care: ఊపిరిపోశారు
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:47 AM
పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు.
చిల్లుపడిన యువకుడి ఊపిరితిత్తులకు అరుదైన శస్త్రచికిత్స
6నెలలు వైద్యం అందించి ప్రాణదానం చేసిన కామినేని డాక్టర్లు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు. ఆదివారం ఆస్పత్రి క్రిటికల్ కేర్, ఎక్మో సర్వీసెస్ నిపుణుడు డాక్టర్ బి. కిషన్ సింగ్ చికిత్స వివరాలను తెలిపారు. ఈవెంట్ మేనేజర్ అయిన నరసింహ 6నెలల క్రితం హయత్‌నగర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొన్నది. ఈ ఘటనలో అతడి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడింది. ఫలితంగా గాలి అందకపోవడంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గింది. ప్రమాదంలో నరసింహ తలకు గాయాలయ్యాయి. తుంటి ఎముక కూడా విరిగింది.
దీంతో నరసింహ బతికే అవకాశాలు తక్కువేనని చాలా ఆస్పత్రుల వైద్యులు చెప్పారు. చివరకు ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి నరసింహను అతని భార్య స్వేచ్ఛ తీసుకువచ్చారు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు.. ముందుగా విరిగిపోయిన ఐదారు పక్కటెముకలకు కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్స చేశారు. తర్వాత మెదడుకు మూడో స్థాయి గాయాలు కావడంతో దాన్ని సరిచేయడానికి వెంటిలేటర్‌పై పెట్టి క్రిటికల్ కేర్ విభాగం నుంచి వైద్యం అందించారు. ఐసీయూలో ఉండగానే ఫిజియోథెరపీ కూడా మొదలు పెట్టి, తర్వాత పూర్తిస్థాయి రీహాబిలిటేషన్ ఇప్పించారు. ఈ చికిత్సలలో కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్లు డాక్టర్ జలీల్, డాక్టర్ ఎస్.రమేశ్ ఇతర బృందం పాల్గొన్నారు.