TG Politics: హరీశ్‌రావు బాగోతాలు తెలుసు.. కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
ABN , Publish Date - Mar 15 , 2024 | 08:29 PM
జిల్లాలోని లక్డారం క్వారీ విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి రూ.30కోట్ల రాయల్టీని ఎగవేశారని.. అందుకే ఆయనను అరెస్టు చేసినట్లు కాంగ్రెస్ పటాన్ చెరు ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) అన్నారు.
సంగారెడ్డి జిల్లా: జిల్లాలోని లక్డారం క్వారీ విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి రూ.30కోట్ల రాయల్టీని ఎగవేశారని.. అందుకే ఆయనను అరెస్టు చేసినట్లు కాంగ్రెస్ పటాన్ చెరు ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నాడు పటాన్ చెరులో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.30 కోట్లను మధుసూదన్ రెడ్డి ఎగ్గొట్టారని అన్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. గతేడాది మార్చిలో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో క్లోజర్ ఆర్డర్ వచ్చినా అధికారులు దాచి పెట్టారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పటాన్ చెరును ఏటీఎంగా మార్చుకుని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లోకి మహిపాల్ రెడ్డి రానవసరం లేదని తేల్చిచెప్పారు. ఆయన అక్రమ దందాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు (Harish rao) తనను గతంలో బీఆర్ఎస్‌లోకి రావాలని ఒత్తిడికి గురిచేసి ఒప్పుకోకపోతే సర్పంచ్ పదవి నుంచి తొలగించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిస్వార్థంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని.. అవినీతిని ప్రోత్సహించేది లేదన్నారు. హరీశ్‌రావు బాగోతాలు జిల్లాలో అందరికీ తెలుసునని.. ఏ భూమి కబ్జా అయినా, ఎక్కడ అవినీతి జరిగినా ఆయన హస్తం ఉంటుందని అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన భారీ కుంభకోణాలల్లో హరీశ్‌రావు వాటా ఎంతో చెప్పాలని కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి