Hyderabad: పాలిసెట్ లో 84%ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:58 AM
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి విద్యార్థికి ఎంపీసీ విభాగంలో మొదటి ర్యాంకు
ఎంబైపీసీ విభాగంలో సూర్యాపేట విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
హైదరాబాద్/సిటీ (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సెట్‌కు 92,808 మంది విద్యార్థులు ద రఖాస్తు చేసుకోగా.. ఇందులో 82,319 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 69,728 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 36 మార్కులు (30 శాతం) సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఒక్క మార్కు సాధించినా ఉత్తీర్ణులుగా పరిగణించారు. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నికల్ కాలేజీలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సుల్లో సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. కాగా పాలిసెట్‌లో ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన తూమాటి హరీష్ ఎంపీసీ విభాగంలో 120కి 120మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించాడు. హరీష్ తల్లి శశి.. అంగన్‌వాడీ టీచర్. తండ్రి వెంకటేశ్వరరావు ఓ దుకాణంలో గుమస్తా.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన హరీష్ పాలిసెట్‌లో ప్రథమ స్థానం సాధించటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంబైపీసీ విభాగంలో సూర్యాపేట బాలాజీ నగర్‌కు చెందిన గోపగాని శ్రీనిఖ 119.5 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి ముత్యాల పార్థసారథి ఎంపీసీ విభాగంలో 118మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కంది శివకుమార్ 114 మార్కులతో 93వ ర్యాంకు సాధించడంతోపాటు ఎంబైపీసీ విభాగంలో 110.5 మార్కులతో 119వ ర్యాంకు సాధించాడు. కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఆరెందుల అశ్రిత ఎంపీసీ విభాగంలో 110 మార్కులు సాధించి 278వ ర్యాంకు సాధించింది. కాగా పాలిసెట్‌లో హైదరాబాద్ విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 15 ర్యాంకుల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నారు. ఎంపీసీ విభాగంలో 2, 10, 12 ర్యాంకులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో 5వ ర్యాంకు హైదరాబాద్ విద్యార్థుల సొంతమైంది. మీర్‌పేట్ త్రివేణి నగర్‌కు చెందిన కటకం లలిత్ మనోహర్ ఎంపీసీ స్ర్టీమ్‌లో స్టేట్ 2వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో బీటెక్ చదవడమే తన లక్ష్యమని మనోహర్ తెలిపాడు. మల్కాజిగిరి బీజేఆర్ నగర్‌కు చెందిన ముతోజు విష్ణువర్థన్ బైపీసీ స్ట్రీమ్‌లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవడమే తన లక్ష్యమని తెలిపాడు. అల్వాల్ వీబీఆర్ కాలనీకి చెందిన చెలిమెల రోహన్ 10వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలనేది తన ఆకాంక్షగా తెలిపాడు. ఉప్పల్‌కు చెందిన వనం అమూల్య 12వ ర్యాంకు సాధించింది. మారేడ్‌పల్లిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలకా్ట్రనిక్స్‌లో ఏఐఎంఎల్ డిప్లొమా చదవాలని తన ఆకాంక్షగా పేర్కొంది.
ఎంపీసీ విభాగంలో టాప్ 5 ర్యాంకర్లు
ర్యాంకు పేరు జిల్లా
1 తూమాటి హరీష్ ఖమ్మం
2 లలిత్ మనోహర్ కటకం రంగారెడ్డి
3 జి.భవిత మహబూబ్‌నగర్
3 గోపగాని శ్రీనిఖ సూర్యాపేట
5 ముత్యాల పార్ధసారథి మహబూబాబాద్
5 నవ్వాతి సుశాంత్ భద్రాద్రి కొత్తగూడెం
5 గోత్రాల అక్షర కామారెడ్డి
ఎంబైపీసీ విభాగంలో టాప్ 5 ర్యాంకర్లు
ర్యాంకు పేరు జిల్లా
1 గోపగాని శ్రీనిఖ సూర్యాపేట
2 సామ అశువర్ధన్ రెడ్డి సూర్యాపేట
3 జి. భవిత మహబూబ్‌నగర్
4 కట్టా హితేష్ జగిత్యాల
5 ముతోజు విష్ణువర్ధన్ హైదరాబాద్