Kishan Reddy: అసహనంతోనే బీజేపీ ఎంపీలపై దాడులు
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:09 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
కాంగ్రె్‌సపై కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ
తోపులాటలో గాయపడిన బీజేపీ ఎంపీలకు పరామర్శ
న్యూఢిల్లీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వివిధ రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో వరుసగా ఓటములు ఎదురవడంతో కాంగ్రెస్ నాయకుల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. శుక్రవారం పార్లమెంటులో జరిగిన తోపులాటలో గాయపడి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలు చంద్రప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌ను కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని కిషన్‌రెడ్డి చెప్పారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఎంపీలకు, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అంబేడ్కర్‌ను అవమానించి, కేంద్ర మంత్రివర్గం నుంచి అవమానకరరీతిలో బయటకు పంపించిందంటూ ఆయన కాంగ్రె్‌సపై ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అంబేడ్కర్ ఆలోచనలను సాకారం చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ వైఖరిని ఖండిస్తూ పార్లమెంట్ ముందున్న గాంధీ, అంబేడ్కర్ విగ్రహల వద్ద శుక్రవారం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, గొడం నగేష్ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.