Kishan Reddy: హైదరాబాద్‌లో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:31 AM
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో మాత్రం ఇళ్లను కూల్చివేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తం
తిట్టుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ
వరంగల్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గీసుగొండ, వరంగల్ కల్చరల్, మిల్స్‌కాలనీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో మాత్రం ఇళ్లను కూల్చివేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గీసుగొండ మండలం ధర్మారం వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సభ్యత్వ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తిట్టుకోవటంలో, దిగజారుడు రాజకీయాల్లో పోటీపడుతున్నాయన్నారు.
రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్‌ఎస్ కుటుంబ, అహంకార పాలనను తిరస్కరించిన ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. అన్‌పార్లమెంటరీ భాషను వాడే రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా వారి వార్తలను మీడియా నిషేధించాలని ఆయన సూచించారు.
భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు.. ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. అమ్మవారిని ప్రధాని నరేంద్రమోదీ దర్శించి ఆశీస్సులు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. మంత్రి వెంట హనుమకొండ, వరంగల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.