Kishan Reddy: అస్తవ్యస్త విధానాలతో కాంగ్రెస్ పాలన
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:13 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగానే కాంగ్రెస్ సర్కారు కూడా అస్తవ్యస్త విధానాలతో పాలన కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీఆర్‌ఎస్ బాటలోనే రేవంత్ సర్కారు
కూల్చివేతలతో ప్రజల్లో భయాందోళనలు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగానే కాంగ్రెస్ సర్కారు కూడా అస్తవ్యస్త విధానాలతో పాలన కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సలాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనాలోచితంగా వ్యవహరిస్తుండడంతో లక్షలాది మంది ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ, ఆ పేరు చెప్పి, పేదల ఇళ్లు కూల్చడమేంటని నిలదీశారు. మూసీతో ముడిపడి ఉన్న నగర మురుగునీటి వ్యవస్థకు పరిష్కారం చూపకుండా పేదల ఇళ్లు కూల్చి, వేలాది మంది బాధితులను ఎలా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గతంలో బీఆర్‌ఎస్ కూడా పేదల ఇళ్లు మార్కింగ్ చేసిందని, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనకడగు వేసిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి రూరల్, అర్బన్, హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి, గోల్కొండ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని, ఆ తర్వాతే సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలంటూ కొన్ని కూల్చివేతలు చేపట్టి భయభ్రాంతులకు గురిచేయగా, ఇప్పుడు హైడ్రా పేరిట కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తోందని మండిపడ్డారు.