Kishan Reddy: ఇద్దరూ ఇద్దరే..
ABN , Publish Date - Aug 22 , 2024 | 03:20 AM
తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు, ఇప్పుడు సీఎం రేవంత్ పాలనకు తేడా లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌కు రేవంత్‌కు తేడా లేదు!
ఆయనతో బంగారు తెలంగాణ రాలే..
ఈయనతో ప్రజాపాలనా రాలే!
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకేతాను ముక్కలు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు, ఇప్పుడు సీఎం రేవంత్ పాలనకు తేడా లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మారలేదు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మేలు కోసమే పనిచేశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సుమారు 400 పైగా హామీలు, 6 గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టిందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా జనాన్ని మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ గందరగోళంగా మారిందన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు శిబిరంలో కిషన్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. బీజేపీ అంటే కుటుంబాలు, వ్యక్తుల కోసం పనిచేసేది కాదని.. దేశం కోసం, సమాజం కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలన్నారు. గతంలో గాంధీ భవన్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌కు వెళ్లగా, నేడు తెలంగాణ భవన్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గాంధీభవన్‌కు వెళ్తున్నారని చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదని.. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలనా రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విమోచన 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా సెప్టెంబరు 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ రీతిలో ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలు, మండలాలు, పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, అన్ని వర్గాల ప్రజలను సభ్యులుగా చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ కార్యకర్తలే: అభయ్‌పాటిల్
పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా సాధారణ కార్యకర్తల్లాగే పనిచేయాలని పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి అభయ్‌పాటిల్ స్పష్టం చేశారు. పదవులు పార్టీ సంస్థాగత పనుల్లో అడ్డంకి కారాదన్నారు. సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవడంలో భాగంగా జిల్లాల అధ్యక్షులకు సహకరించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులను కోరారు. ‘నేను ఇక్కడకు ఇన్‌చార్జిగా వస్తున్నానంటే కొంతమంది భయపడ్డారు.
మరికొంతమంది సంతోషపడ్డారు. దానికి నేనేం చేస్తా?’ అంటూ తనపై వ్యతిరేకభావంతో ఉన్న నేతలనుద్దేశించి పాటిల్ వ్యాఖ్యానించారు. సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తిచేయాలని జాతీయ నాయకత్వం తనకు బాధ్యతలు అప్పగించిందని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్నీ పరిశీలిస్తానని స్పష్టం చేశారు. తన పనితీరు నచ్చకుంటే ఢిల్లీకి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పార్టీ పదవులు కావాలంటే సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
వేదికపైకి పిలవడం లేదని, ఫ్లెక్సీల్లో ఫొటో లేదంటూ కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడం విస్మయం కలిగిస్తోందని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ఫొటో లేనంత మాత్రాన ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 200 సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ రహత్కర్ అన్నారు. లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొదించుకోవాలన్నారు. మూడు దశల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉంటుందని తెలిపారు.