Share News

సోలార్‌ కరెంటులో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం

ABN , Publish Date - Oct 14 , 2024 | 03:46 AM

ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం(గ్లోబల్‌ లీడర్‌)గా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

సోలార్‌ కరెంటులో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం

  • కుల గణన పేరుతో రాష్ట్ర సర్కారు కాలయాపన

  • స్థానిక ఎన్నికలను ఆలస్యం చేసేందుకే: సంజయ్‌

మన్సూరాబాద్‌/హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం(గ్లోబల్‌ లీడర్‌)గా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాగోల్‌ బండ్లగూడలోని జీఎ్‌సఐటీఐ(జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)లో నూతనంగా ఏర్పాటు చేసిన 150 కిలోవాట్ల రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి శనివారం కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... పునరుత్పాదన శక్తి వనరులను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జీఎ్‌సఐ నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. సంస్థలో ఏర్పాటు చేసిన ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ 75 శాతం మేర కరెంటు అవసరాలను తీర్చి ఏటా 30 లక్షలు ఆదా చేస్తుందని చెప్పారు. దేశ పురోగతిలో పునరుత్పాదక ఇంధనం ప్రాముఖ్యాన్ని ఎంపీ ఈటల రాజేందర్‌ వివరించారు. అనంత రం ప్లాంట్‌ ప్రారంభోత్సవ జ్ఞాపకార్థంగా జీఎ్‌సఐటీఐ ప్రాంగణంలో మొక్కను నాటారు.


  • సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది..?: సంజయ్‌

కుల గణన సర్వే అన్నది కాంగ్రె్‌సకు కాలయాపన వ్యవహారంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేసేందుకే ఈ నాటకాలని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు, రుణమాఫీ విషయంలో ప్రజలు కాంగ్రెస్‌ పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే కుల గణన పేరుతో కాలయాపన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆదివారం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులం సహా అన్ని వివరాలు సేకరించినా, ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీఆర్‌ఎ్‌సతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ నివేదికను బయటపెట్టడం లేదా..? అని ప్రశ్నించారు. ‘‘అసలు ఆ సర్వేతో ఒనగూరిన ప్రయోజనం ఏంటి..? ఆ నివేదిక ఉండగా మళ్లీ కుల గణన సర్వే పేరుతో రూ.150 కోట్లు కేటాయించి 60 రోజుల గడువు పెట్టడమెందుకు..? సమగ్ర కుటుంబ సర్వే నివేదిక నాటికి, నేటికి తెలంగాణ ప్రజల కులం ఏమైనా మారిందా..? కాంగ్రెస్‌ నేతల తీరు చూస్తుంటే కుల గణన అబద్ధమనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టాలి’’ అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 14 , 2024 | 03:46 AM