Kishan Reddy.G: రేవంత్.. హామీలను నెరవేర్చలేరు
ABN , Publish Date - May 19 , 2024 | 04:05 AM
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజీపీ కార్యకర్తల భేటీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గుడ్ బై
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే: కిషన్‌రెడ్డి
భువనగిరి టౌన్/హనుమకొండ టౌన్, మే 18: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజీపీ కార్యకర్తల భేటీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పొగుడుతూ, విపక్షాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం రేవంత్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని అన్ని పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు స్థానిక నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే దానం, కడియం తరహాలో పార్టీ మారతాడని.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్‌రెడ్డి జపం చేస్తాడని అన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రజా గొంతుకగా నిలుస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు.
సీఎంను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..
మంత్రులు గొడవలు పడి ప్రభుత్వాన్ని కూల్చుకుంటే తామేమీ చేయలేమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని, రుణమాఫీ చేయాలని కోరారు.
వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని బీజేపీనేత రఘునందన్‌రావు తెలిపారు. కేసులో ఆధారాలున్నా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి డీజీపీ రవిగుప్తాను రఘునందన్ శనివారం కలిశారు. అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అయినందునే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయలేదా..? అని డీజీపీని అడిగామని చెప్పారు.