త్వరలోనే బీఆర్‌ఎస్ దుకాణం బంద్!
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:13 AM
బీఆర్‌ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోంది
8,888 కోట్లపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం
వారి హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు
దాంట్లో రూ.2 లక్షల కోట్లు వారే దోచుకున్నరు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు
లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడొద్దు!
యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు సూచించిన మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల
ఆలేరు రూరల్/భువనగిరి అర్బన్, సెప్టెంబరు 22: బీఆర్‌ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై కేటీఆర్ ఇచ్చిమొచ్చినట్లు మాట్లాడుతూ, రూ.8,888 కోట్లు దుర్వినియోగమయ్యాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, మునిసిపల్ చైర్మన్లు పోతున్నారని, ఆ బాధలోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ దుకాణం బంద్ కానుందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులేనని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత ఆ పార్టీదేనన్నారు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రజాదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు మునిసిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్ అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని, 3 నెలలు ఎన్నికల కోడ్‌లోనే గడిచిందని చెప్పారు.
తాము 6 నెలల్లో రూ.6 వేల కోట్ల అప్పులు చేశామని కేటీఆర్ అంటున్నారని, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కుంభకోణం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోయిందన్నారు. దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే అమెరికా వెళ్లి, ప్రభాకర్‌రావును ఇండియాకు రానివ్వడం లేదని ఆరోపించారు. దోచుకు తిన్నోడికి దోపిడీయే కనబడుతుందని, మీ కుటుంబంలా తాము దోచుకోవడం లేదని మంత్రి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత కలిసి రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రూ.2 లక్షల కోట్లు దోచుకున్నది. వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను తీసుకువెళ్లి ఆలేరును ఎడారిగా మార్చారని విమర్శించారు. యువతకు ఉపాధి కోసం ఫార్మాసిటీ అంటూ మోసం చేశారని ఆరోపించారు.
ప్రసాదాల నాణ్యతలో రాజీపడొద్దు
రాష్ట్రం సుభిక్షంగా, రైతులు సంతోషంగా ఉండాలని లక్ష్మీనరసింహస్వామి వారిని కోరుకున్నట్లు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం వారు యాదగిరిగుట్ట ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడొద్దని ఈ సందర్భంగా మంత్రులు ఆలయ ఈవో భాస్కర్‌రావుకు సూచించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు బాగుండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించినట్లు చెప్పారు.