Komatireddy: కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం!
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:09 AM
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, అది కూలేశ్వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.
ఆ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, అది కూలేశ్వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో శనివారం రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు అంశాలన్నీ మోసమేనని అన్నారు.
2001లో పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, లేదంటే తన మెడపై తల ఉండదని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, అబద్ధాల చాంపియన్ అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకోవాల్సింది పోయి, ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే అబద్ధాల చాంపియన్‌ను సభకు రమ్మనండి.. ఆయనొస్తే మాట్లాడుదాం.. అంటూ చురకలు అంటించారు.