Share News

Komatireddy Venkatareddy : పనుల్లో జాప్యానికి సాకులు చెప్పొద్దు..

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:03 AM

రోడ్ల పనులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, జాప్యానికి సాకులు చెప్పొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. రాష్ట్రానికి రహదారులు జీవనాడులని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడేళ్లుగా కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు మంజూరయ్యాయని ఆరోపించారు.

Komatireddy Venkatareddy : పనుల్లో జాప్యానికి సాకులు చెప్పొద్దు..

  • ఆర్‌ఆర్‌ఆర్‌పై పకడ్బందీగా కసరత్తు చేయండి.. గత ప్రభుత్వం వల్లే కేంద్రం నుంచి తక్కువ నిధులు

  • రోడ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు

  • ప్రమాదాల నియంత్రణకు చర్యలు

  • సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రోడ్ల పనులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, జాప్యానికి సాకులు చెప్పొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. రాష్ట్రానికి రహదారులు జీవనాడులని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడేళ్లుగా కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇకపై అలసత్వానికి తావులేకుండా రహదారుల నిర్మాణానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) కార్యాలయంలో జాతీయ రహదారులపై ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, జాయింట్‌ సెక్రటరీ హరీశ్‌, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్వో రజాక్‌, కేంద్ర రహదారుల ప్రాంతీయ అధికారి కుష్వా, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఎన్ని కోట్లు వెచ్చించినా పోయిన ప్రాణం తిరిగి రాదని, ప్రజలను కాపాడలేకపోతే.. ప్రభుత్వం ఉండి ఎందుకు? అని ప్రశ్నించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు రాష్ట్రానికే మణిహారం కానుందని, పనులను ప్రారంభించేందుకు పకడ్బందీగా కసరత్తు చేయాలని సూచించారు. ఈ రోడ్డు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు ప్రారంభమైతే డిస్నీల్యాండ్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడుతాయని చెప్పారు. హైదరాబాద్‌- విజయవాడ (ఎన్‌హెచ్‌-65) రహదారిని ఆరు లేన్లుగా విస్తరించేందుకూ చర్యలు చేపట్టాలన్నారు. జూలైలో కొత్త టెండర్లను ఆహ్వానించి, సెప్టెంబర్‌లోగా పనులు ప్రారంభించాలని ఎన్‌హె చ్‌ఏఐ అధికారులకు సూచించారు.


ఎన్‌హెచ్‌-645ను గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా నిర్మించే డీపీఆర్‌పైనా చర్చించారు. ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌ టెండర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మన్నెగూడ రోడ్డు నిర్మాణంలో ఆలస్యంపై మంత్రి ప్రశ్నించగా.. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం 930 చెట్లను మరోచోటకు మార్చాల్సి ఉందని, మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. చెట్లను మరోచోటకు తరలించే ప్రక్రియ త్వరితగ తిన పూర్తిచేసేలా నిర్మాణ సంస్థతో మాట్లాడాలన్నారు. ఆర్మూర్‌- మంచిర్యాల జాతీయ రహదారి కోసం మరో 100హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, జాతీయ రహదారుల నిర్మాణ స్థితిగతులను తెలుసుకునేందుకు జూలై మొదటి వారంలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల బృందం తెలంగాణకు రానుందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు మంజూరైన రహదారులు, నిర్మాణంలో ఉన్న రోడ్లు, అనుమతలు రాక నిలిచిపోయిన వాటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

Updated Date - Jun 29 , 2024 | 03:03 AM