Share News

Srisailam Project: శ్రీశైలానికి పెరిగిన వరద

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:37 AM

కృష్ణా బేసిన్‌ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. మంగళవారం 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డు కాగా... బుధవారం 1,24,112 క్యూసెక్కులుగా నమోదైంది.

Srisailam Project: శ్రీశైలానికి పెరిగిన వరద

  • 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • కృష్ణా ప్రాజెక్టులపై 1,033 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పాదన..

  • మట్టి గోడ కూలి ఒకరు.. వాగులో కొట్టుకుపోయి మరొకరి మృతి

  • మురికికాలువలో పడి చిన్నారి గల్లంతు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : కృష్ణా బేసిన్‌ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. మంగళవారం 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డు కాగా... బుధవారం 1,24,112 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,03,950 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 71,910 క్యూసెక్కులను సాగర్‌కు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఘాట్‌రోడ్డులో మంగళవారం రాత్రి భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి.


దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 47 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. జలవిద్యుత్తు ఉత్పాదనతో 47 వేలను దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 19 వేల ఇన్‌ఫ్లో ఉండగా... 33 వేల ఔట్‌ ఫ్లో ఉంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో జలవిద్యుత్తు ఉత్పాదన జోరందుకుంది. రోజుకు గరిష్ఠంగా 46 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీజన్‌లో మంగళవారం రాత్రి 12 గంటలదాకా 1033.92 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పాదన జరిగింది.


ఇందులో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 488.88 మిలియన్‌ యూనిట్లు... నాగార్జునసాగర్‌లో 342.38 మిలియన్‌ యూనిట్లు, జూరాలలో 90.16 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి చేశారు. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 30 వేల ఇన్‌ఫ్లో ఉండగా... 9,010 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లికి 12 వేలు, ఎస్సారెస్పీకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లోని మూసీ ప్రాజెక్టుకు 3,756 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే గరిష్ఠస్థాయి నీటి నిల్వకు దగ్గరలో ఉండటంతో.. సాయంత్రం 3 గేట్లను అడుగు మేర ఎత్తి 1,935 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ నీటి మట్టం పూర్తి సామర్థ్యం 513.41 మీటర్లకు.. ప్రస్తుతం 513.60 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,700 క్యూసెక్కులు దిగువకు వదిలారు.


  • గోడ కూలి ఒకరు.. వాగులో కొట్టుకుపోయి మరొకరు

వర్షాల నేపథ్యంలో మట్టి గోడ కూలి ఓ బాలిక, వాగులో కొట్టుకుపోయి ఓ వృద్ధురాలు మృతి చెందగా.. మురికికాలువలో పడి రెండేళ్ల చిన్నారి గల్లంతైంది. గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీ పరిధిలోని కొత్తపేట వీధిలో చాకలి నర్సింహులు, రేవతి దంపతులకు కూతురు శ్రీకృతి (8), ఇద్దరు కుమారులున్నారు. వీరు ఓ గుడిసెలో 25 ఏళ్లుగా నివాసముంటున్నారు. అయితే రెండ్రోజులుగా వర్షాలతో గుడిసె గోడలు తడిసిపోయాయి. రోజూలాగే నర్సింహులు కుటుంబంతో నిద్రకు ఉపక్రమించగా మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోడ కూలింది.


దీంతో రేవతి, శ్రీకృతికి గాయాలయ్యాయి. శ్రీకృతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లికి చెందిన గుడిసె పోళమోళ్ల నర్సమ్మ (60) మంగళవారం సాయంత్రం పెద్దవాగులో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో బట్టలు ఉతికే ప్రాంతంలో వాగు ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు అనుమానించారు.


బుధవారం పర్మాన్‌దొడ్డి శివారులో గల వాగు ఒడ్డు వద్ద నర్సమ్మ శవమై కనిపించింది. ఇటు నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్‌లో అనన్య (2) ఆడుకుంటూ ఇంటిపక్కనే ఉన్న మురికి కాలువలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన బాలిక తల్లి ఏడుపులు విని.. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులు, మునిసిపల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు గాలింపు చర్యలు చేపట్టిన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. పొక్లెయినర్‌తో కాలువ నీటిని మళ్లిస్తూ బాలికను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలిక తండ్రి మారుతి సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

Updated Date - Aug 22 , 2024 | 04:37 AM