KTR: డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టు
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:01 AM
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డబ్బుసంచుల కోసం తెరపైకి తెచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైడ్రాను నడిపిస్తోంది రేవంత్ కాదు.. రాహుల్.. కూల్చివేతలకు కేంద్రం మద్దతు ఉందనిపిస్తోంది
మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని దద్దమ్మ రేవంత్
మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆరోపణలు
కూల్చివేతల బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డబ్బుసంచుల కోసం తెరపైకి తెచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయనే వెనక ఉండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలను నడిపిస్తున్నది కూడా సీఎం రేవంత్‌రెడ్డి కాదని, రాహుల్ గాంధీయేనని తెలిపారు. ఈ కూల్చివేతలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. హైడ్రాపై ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించడం కేంద్రానికి తెలియకుండానే జరుగుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘కాంగ్రె్‌సకు నోట్ల కట్టలు కావాలి.. బాధితుల కష్టాలు పట్టవు. వారు చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’’ అని విమర్శించారు.
మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారో త్వరలో బయటపెడతానన్నారు. 2400 కిలోమీటర్ల నమామిగంగ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు ఖర్చయితే.. 55 కిలోమీటర్లున్న మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకవుతుందని ప్రశ్నించారు. పేదలకు కష్టం వస్తే వాలిపోతానని ఎన్నికల సమయంలో చెప్పిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు పేదల ఇళ్లను బుల్డోజర్లతో తొక్కిస్తుంటే ఎక్కడ చచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పర్యటించి ప్రజలను ఒప్పించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రాన్ని బాగుచేస్తానని బయలుదేరాడు’’ అని కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సమన్వయం లేదన్నారు.
మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం
కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హైడ్రా, మూసీ బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి న్యాయపరంగా సాయం చేసేందుకు తమ వద్ద న్యాయవాదుల బృందం ఉందన్నారు. అన్ని అనుమతులున్నా.. ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కాగా, రాష్ట్ర క్యాబినెట్‌లో రెండోస్థానంలో ఉన్న ఓ మంత్రి.. బుధవారం నగరంలోని ఓ హోటల్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో సమావేశమయ్యారని కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారని తెలిపారు. అదానీతో కాంగ్రెస్ దోస్తీ చేస్తుందా? లేక రాయదుర్గంలోని విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు.