Share News

KTR: రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:02 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి, ఉద్యోగం చేస్తున్నవారికి, పాన్‌ కార్డులు ఉన్నవారికీ రైతు భరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, ఇది సరైంది కాదన్నారు.

KTR: రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం

  • ఆదాయపు పన్ను కడితే సాయం చేయరా?

  • పథకంపై ఇచ్చిన నివేదికను సభలో పెట్టండి

  • ఏ ఊరిలోనూ 100ు రుణమాఫీ కాలేదు

  • 24 గంటల కరెంట్‌ ఎక్కడా ఇవ్వడం లేదు

  • తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తాం

  • భూములన్నింటికీ రైతుబంధు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది

  • ఎన్ని కేసులు పెట్టినా భయపడం: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి, ఉద్యోగం చేస్తున్నవారికి, పాన్‌ కార్డులు ఉన్నవారికీ రైతు భరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, ఇది సరైంది కాదన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందికిపైగా పాన్‌ కార్డులు ఉన్నాయని, వీరిలో రైతులు కూడా ఉన్నారని చెప్పారు. రైతుల పిల్లల్లో కొందరు ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నారని, అలాంటి రైతులకూ రైతుభరోసా ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. శనివారం శాసనసభలో రైతు భరోసా పథకంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్‌ వద్ద కేటీఆర్‌ మాట్లాడారు. రైతుబంధు (రైతు భరోసా)ను అవమానిస్తున్నారని, ఈ పథకం ఉసురు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా విదివిధానాలను ఖరారు చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి అందరికీ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రుణమాఫీ అందరికీ వర్తించలేదన్నారు.


సిరిసిల్ల, పాలేరు, కొండారెడ్డిపల్లెతో పాటు రాష్ట్రంలోని ఏ ఊరిలోనూ వందశాతం రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయినట్టు చూపించినా, 24 గంటల కరెంట్‌ ఇస్తున్నట్లు నిరూపించినా తనతో పాటు బీఆర్‌ఎస్‌ సభ్యులమంతా రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు. సీఎం రేవంత్‌ దేవుడు కాదు.. పచ్చి దొంగ అని, ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ అని ఘాటుగా విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పాలమూరును సస్యశ్యామలం చేశామని, రైతులకు ఉచితంగా సాగు నీటిని అందించామని చెప్పారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించినా రైతులపై భారం వేయలేదన్నారు. గతంలో సాగు చేసినా.. చేయకపోయినా భూములన్నింటికీ రైతుబంధు పథకాన్ని అమలు చేయడం వల్లే 141 లక్షల ఎకరాల నుంచి 2.06 కోట్ల ఎకరాలకు సాగు పెరిగిందని చెప్పారు. 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలకూ రైతుబంధు అమలు చేశామని, గిరిజనులు ఒకే పంట పండిస్తారని, అయితే ఒక పంటకే రైతు భరోసా ఇస్తారా..? లేక రెండో పంటకూ ఇస్తారా..? లేదా..? చెప్పాలన్నారు.


పత్తి కూడా 8 నెలల పంట, కంది 7-8 నెలల పంట అని, ఇక్కడా ఒకే పంటకు రైతు భరోసా ఇస్తారా...? రెండో పంటకూ ఇస్తారా...? లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. పామాయిల్‌, మామిడి పంటల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 11.1 శాతం ఉంటే దాన్ని 1.57 శాతానికి తగ్గించామని, ఈ ఘనత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాని దేనన్నారు. వాస్తవాలను గ్రహించకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన్ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు ఎర్రగడ్డలో చేర్పించి వైద్యం చేయించాలని సూచించారు. రేవంత్‌ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, ఈడీ, మోడీ, ఎవడీకి భయపడేది లేదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు కాంగ్రె్‌సను వదిలేది లేదని, రేవంత్‌ రెడ్డిని, ఆ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటామని చెప్పారు. ఓ క్రమంలో రేవంత్‌రెడ్డి అంటూ ఏకవచనంతో కేటీఆర్‌ పలకగా.. సభా నాయకుడిని ఏకవచనంతో పిలవడం సహేతుకం కాదని స్పీకర్‌ స్పష్టం చేశారు. అయితే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుందని కేటీఆర్‌ బదులిచ్చారు.


ఆర్థిక సాయం కోసం కౌలు రైతుల ఎదురుచూపు

రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారందరూ కాంగ్రెస్‌ ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి-2024 చట్టంలో అనుభవదారు కాలమ్‌ను తీసుకొచ్చారని, దాని ద్వారా కౌలు రైతుల లెక్కలు తెలుస్తాయని, వాటి ప్రకారం వారందరికీ సాయం అందించాలని కోరారు. రైతులకు సర్కార్‌ ప్రకటించిన బోనస్‌ బోగస్‌గా మారిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదికే రైతులకు బేడీలు వేశారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌ను గుర్తుచేశారు. ఆయన బతికుంటే ఇప్పటి పరిస్థితిని చూసి చాలా బాధపడేవారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా బడా వ్యాపారులకు కొమ్ముగాస్తున్నదని కేటీఆర్‌ ఆరోపించారు. బ్యాంకులను మోసం చేసిన వారినీ కాపాడుతోందని విమర్శించారు. అనంతరం కేటీఆర్‌ ప్రసంగంపై స్పీకర్‌ కలుగజేసుకుంటూ.. ‘ఇది రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ.. దానిపైనే మాట్లాడాలి’ అని సూచించగా.. అవసరమైతే సభను పొడిగించండంటూ కేటీఆర్‌ అన్నారు. ఇదే అంశంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వారికి వారమే సమయం ఉందంటా.. అందుకే వారం సభను నడపాలని కోరుతున్నారంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కోమటిరెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి: హరీశ్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్లు కాదు.. రూ.28 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌ రావు కోరారు. ‘సభ అయిపోయిన తర్వాత తుంగతుర్తి, సూర్యాపేటకు పోదాం.. 2 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్లు ఇచ్చామో లేదో చూపిస్తా.. నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్‌ కాలేజీలు ఇచ్చాం. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను మంజూరు చేశాం’ అని ఆయన చెప్పారు.

Updated Date - Dec 22 , 2024 | 04:02 AM