Share News

KTR: త్వరలో పాదయాత్ర

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:04 AM

కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆస్క్‌ కేటీఆర్‌ పేరిట గురువారం ఎక్స్‌ వేదికగా చేపట్టిన కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

KTR: త్వరలో పాదయాత్ర

  • కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడతా

  • వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సర్కారు వేధింపులు

  • కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం నీచం

  • రేవంత్‌రెడ్డి వచ్చాకే ఈ సంస్కృతి మొదలైంది

  • మా వాళ్లపై రెచ్చిపోతున్న పోలీస్‌ల పనిపడతాం

  • కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రజల్లోకి కేసీఆర్‌

  • ఆస్క్‌ కేటీఆర్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆస్క్‌ కేటీఆర్‌ పేరిట గురువారం ఎక్స్‌ వేదికగా చేపట్టిన కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేేసందుకు రాష్ట్రవ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. హామీల అమలుతోపాటు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత పాటించేలా ప్రజల తరఫున కొట్లాడతామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పాలన శాపంగా మారిందని, నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ఆర్థికప్రగతి పూర్తిగా పతనమయిందని, ఈ నష్టం నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం రాజకీయ వేధింపులను ప్రారంభించిందని, వీటికి భయపడేది లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలన ప్రమ్‌ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్‌ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవాచేశారు.


  • ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి కేసీఆర్‌

కొత్తసంవత్సరంలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వస్తారని కేటీఆర్‌ తెలిపారు. తమ పార్టీ అధినేత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పార్టీ నాయకులందరికీ ఆయా అంశాలపై మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షనేతగా కొత్త ప్రభుత్వం తన హమీలు అమలు చేేసందుకు సరిపడా సమయం ఇచ్చారని, కొద్ది నెలల్లో కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో.. ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. 20ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుటుంబ సభ్యులను అవహేళనచేసి మాట్లాడినప్పుడు ఎంతో ఆవేదన కలిగిందన్నారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదని, ఈవిషయం అత్యంత బాఽధాకరమన్నారు. ఇవన్నీచూసి రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యానని కేటీఆర్‌ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకనే.. ఈ నీచమైన రాజకీయ సంస్కృతి మొదలైందని, ఈ దశకూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం తమకుందన్నారు. తమపై కక్షతో.. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న నీచరాజకీయాలపై ప్రజల మద్దతుతో పోరాడతామన్నారు. రాజకీయపరమైన అంశాలపై విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ అగ్ర నాయకులందరితో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు.


  • అధికారంలోకి వచ్చాక పోలీసులపై చర్యలు

ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉన్నారని.. దీంతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయన్నారు. అధికార పార్టీ పెద్దల మాటలు విని.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులపై చట్ట విరుద్ధంగా రెచ్చిపోతున్న పోలీస్‌ అధికారులను గుర్తుపెట్టుకుంటాం. మేం అధికారంలోకి వచ్చాక వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.


  • దళారులతో కుమ్మక్కై..

దళారులతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మిల్లుల కేటాయింపు జరగలేదని కేటీఆర్‌ ఆరోపించారు. ఈసీజన్లో 91.28లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని.. అక్టోబరు 28వరకు 913మంది రైతుల నుంచి కేవలం 7,629టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేశారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌లో బిజీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.


  • నయవంచనపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి

అధికారం కోసం అలవిగాని హామీలతో తెలంగాణ ప్రజలను నమ్మించి నయవంచన చేసినందుకు కాంగ్రె్‌సపార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రబడ్జెట్‌ను మించి గ్యారెంటీలు ఇస్తే.. దివాళాతీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఎక్స్‌వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్‌ గురించి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు నమ్మిన పాపానికి.. ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిదని, కాంగ్ర ెస్‌ చేసిన మోసం క్షమించరానిదని కేటీఆర్‌ పేర్కొన్నారు.


  • ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు.. కేటీఆర్‌ పాదయాత్ర డ్రామా: బీర్ల ఐలయ్య

హైదరాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు పాదయాత్ర పేరుతో కేటీఆర్‌ డ్రామాలు మొదలు పెట్టారని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. హరీశ్‌రావును ఎక్కడ ప్రతిపక్ష నేతను చేస్తారోనన్న భయంతోనే ఆయన పాదయాత్రకు పూనుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌ డ్రామాలు అన్నీ తెలుసునని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌ ఈ కొత్త డ్రామాలను పక్కన పెట్టి ముందు కేసీఆర్‌ను ఫామ్‌ హౌస్‌ నుంచి బయటికి తీసుకురావాలన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజా పాలన నడుస్తోందని, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్‌ సిలిండరు ఇస్తున్నామని ఐలయ్య పేర్కొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 05:04 AM