KTR: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు..
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:26 AM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బతుకమ్మ చీరలూ పంచలేని దుస్థితి..
ఢిల్లీ పర్యటనలు తప్ప సీఎం చేసిందేమీ లేదు
రేవంత్ బద్రర్స్ దోచుకోవడానికే ఫోర్ సిటీస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇబ్రహీంపట్నం/ఆదిభట్ల/హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా బొంగ్లూరులోని ప్రమిదా కన్వెన్షన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దసరా సమ్మేళనంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కూడా పంచలేని దుస్థితి.. ఏ వర్గం వారూ సంతోషంగా లేరు.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.
రిజర్వేషన్లు తొలగించే కుట్రలు చేస్తున్నారు. నిరుద్యోగులపై లాఠీలు ఝళిపించే పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. నేడు మీరు చావబాదే అభ్యర్థులే రేపు మీ బాస్‌లుగా రావచ్చనే విషయం మరిచిపోవద్దు’ అని హెచ్చరించారు. అసలు ఫార్మాసిటీ ఉందా లేదా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ నలుగురు సోదరులు దోచుకోవడానికే ఫోర్ సిటీస్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలు మూసీలో కలిసేలా ప్రాజెక్టు తీసుకుంటే మూసీ శుద్ధి అయిపోతుందని.. ఈ ప్రాజెక్టుకు కేవలం 12 వేల కోట్లు సరిపోతాయన్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ 40 శాతం పూర్తి చేయకుండానే... 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టుపై కేటీఆర్ ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య (అనుముల ఇంటెలిజెన్స్) అంటే రేవంత్ వాడిన అబద్ధాల (ఏఐ) టెక్నిక్‌తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు. కాగా, బీఆర్‌ఎ్‌సపై విమర్శలు గుప్పిస్తున్న కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లా కోసం ఏం చేశారో చెప్పాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగర్ నీళ్లు నల్లగొండకు రావడం లేదు.. వాటిని ఖమ్మం తరలిస్తుంటే జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.