KTR: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ABN , Publish Date - Nov 15 , 2024 | 04:18 AM
‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.
వాళ్లకు అర్థమయ్యే భాషలోనే లగచర్ల ప్రజలు
సమాధానం చెప్పారు.. తప్పేంటి?
ఫార్మా సిటీని ఆపేదెవరంటూ గిరిజన
రైతులపై తిరుపతిరెడ్డి బూతులు
సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని
సీఎం బంధువులకివ్వాలనేది ప్రణాళిక
రేవంత్ ప్రైవేటు సైన్యంలా కొందరు ఐపీఎస్‌లు
విఫల సీఎం.. వైఫల్యాల వారోత్సవం చేస్తాం
ఏడాది పాలనకు మైనస్ 10 మార్కులు
బావమరిదికి అమృత్ కాంట్రాక్టుపై
న్యాయ విచారణకు రేవంత్ సిద్ధమా?
‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 14, (ఆంధ్రజ్యోతి): ‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను. నా నిజాయతీకి ఉన్న ధైర్యంతో ఇప్పుడు రేవంత్‌రెడ్డికీ అదే చెబుతున్నా.. చిట్టినాయుడూ ఏం పీక్కుంటావో.. పీక్కో’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసలు కేసులు పెట్టాల్సింది తమ పార్టీ నేత నరేందర్‌రెడ్డిపైన, తనపైన కాదని, కేసులు పెట్టాల్సింది ఎనుముల బ్రదర్స్‌పైన అని చెప్పారు. లగచర్ల రైతులు రేవంత్‌రెడ్డి చేసిన పనులకు ఆయన భాషలోనే సమాధానం చెప్పారన్నారు. రేవంత్ జైలుకెళ్లారు కాబట్టి తననూ ఏదోలా పంపాలని అనుకుంటున్నారని ఆరోపించారు. లగచర్ల కేసులో ఆధారాలుంటే కోర్టులో పెట్టాలని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి తాజాగా లగచర్ల కేసు వరకు వరుస ఆరోపణలు.. కొనసాగుతున్న విచారణలు.. అరెస్టు చేస్తారన్న ప్రచారాల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి కేటీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
లగచర్ల కేసులో మీ పార్టీ నేతలను రెచ్చగొట్టింది మీరే అని, దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి కదా?
వదంతులు, గాసిప్స్, చెవి కొరకడాలు, ఇచ్చికాల మాటలు వీటిమీదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 11నెలలుగా టైమ్‌పాస్ చేసింది. పేదలు, ప్రజలికిచ్చిన హామీలు నెరవేర్చిన పాపాన మాత్రం పోలేదు. అతనో విఫల ముఖ్యమంత్రి. మొదట కాళేశ్వరంలో అవినీతి అన్నారు. తర్వాత విద్యుత్తు రంగంలో ఏదో జరిగిందన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తెచ్చారు. ఫార్ములా వన్ అన్నారు. మా బావమరిది ఇంట్లో డ్రగ్ ్స పార్టీ అన్నారు. ఇప్పుడు లగచర్ల దాడి అంటున్నారు. ఆయన జైలుకెళ్లారు కాబట్టి నన్నూ ఏదోలా పంపాలని అనుకుంటున్నారు. లగచర్ల కేసులో ఆధారాలుంటే కోర్టులో పెట్టమనండి. అసలు అక్కడ జరిగిందేంటి? పేద, గిరిజన రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంటానంటే వారు తిరగబడ్డారు. 9నెలల తర్వాత సహనం నశించడంతో అక్కడికి వెళ్లిన అధికారులను నిలదీశారు. కలెక్టర్ నామీద దాడి జరగలేదు అని రికార్డెడ్‌గా చెప్పారు. ఆయన జిల్లా మెజిస్ట్రేట్. ఆయన చెప్పింది సరైందా? లేకుంటే రేవంత్ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు చెప్పింది సరైందా? గతంలో ఏపీలో ఇలానే చేసిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్న కొందరు పోలీస్ అధికారులకూ అదే గతి పడుతుంది.
కొడంగల్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి, మరో అధికారిపై హత్యాయత్నం జరిగిందని రిమాండ్ రిపోర్టులో ఉంది కదా?
అసలు కేసులు పెట్టాల్సి వస్తే కేసు ఎనుముల తిరుపతిరెడ్డి మీద పెట్టాలి. ఎనుముల తిరుపతిరెడ్డి లగచర్లలోని పేద, గిరిజన రైతులను ఎవడ్రా ఫార్మా క్లస్టర్ ఆపేది అంటూ బండబూతులు తిట్టాడు. చెప్పేందుకు వీల్లేని ఆ బూతుల ఆడియో ఉంది. అతనెవరు? 144సెక్షన్ అమల్లో ఉన్నా 200 మందితో అక్కడ తిరుగుతున్నాడు. స్థానిక ఎంపీ వెళ్తే, మా పార్టీ నేత, శాసనమండలిలో విపక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి వెళ్తే మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిరెడ్డి డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నాడు. ఇంక రెండో కేసు సీఎం రేవంత్‌రెడ్డిపై పెట్టాలి. తన సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే ఒక్కరోజు వారి బాధలు వినలేదు. తన బంధువుల కోసం గిరిజన భూములు లాక్కుంటున్నారు మరోవైపు పోలీసులకు ఒక నిఘా యంత్రాంగం ఉంటుంది. అక్కడ 9నెలలుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు వీళ్ల కళ్లకు కనిపించలేదా? వారి వీడియోలన్నీ ఉన్నాయి. ఆందోళనలు జరుగుతున్నాయని తెలిసినా ఏ సమాచారంతో అక్కడికెళ్లారు? లగచర్ల ఘటన వెనుక నేనున్నానని, నరేందర్‌రెడ్డి నాపేరు చెప్పారని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. అదంతా బక్వాస్ అని ఆయన జైలు నుంచి లేఖ రాశారు. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడిచేేసంత బలమైన వ్యక్తులమా? మేంచెబితే రైతులు దాడులు చేస్తారా? సొంత నియోజకవర్గం మీదకూడా పట్టులేని నువ్వు అసలు ఏం సీఎంవేనా? నీ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మాపై అక్రమకేసులు పెట్టిస్తావా?
దాడిచేయాలంటూ మీరే ఫోన్‌లో చెప్పారని?
ప్రజల ఆగ్రహం ఒకసారి కట్టలు తెంచుకుంటే నియంతలే పోయారు. ఒక ప్రాజెక్టు పెట్టాలంటే ప్రజలను బె దిరిస్తే సరిపోతుందనే వైఖరి సరికాదు. ఆ ఇంగితం రేవంత్‌కు ఉండాలి. ఒక్కటంటే ఒక్కసారి ఆ రైతులకు సమయం ఇచ్చారా? ఫార్మా అంటేనే కాలుష్యం, విషం. ఫార్మా వస్తే ఇక అంతే అని గతంలో ముచ్చర్లలో, యాచారంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెచ్చగొట్టింది రేవంత్‌రెడ్డి కాదా? సంయమనం పాటించాల్సింది భూమి కోల్పోయే రైతులా? ప్రభుత్వమా? 11నెలల నుంచి చంపుతా, నరుకుతా, గుడ్లు పీకుతా, అని మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రికి అర్థమైన భాషలోనే ప్రజలు కూడా ఆయనకు సమాధానం చెప్తున్నారు? నరేందర్‌రెడ్డితో ఆరోజు మాట్లాడానో లేదో నాకు గుర్తులేదు. ఒకవేళ మాట్లాడాననుకో. మా ఎమ్మెల్సీ, మా పార్టీ నేత.. .ఒకసారి కాదు. 10సార్లు మాట్లాడొచ్చు. నన్ను అరెస్టు చేస్తే జైలునుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా. ఈ ప్రభుత్వం రైతులపట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. లగచర్ల ఘటనలో 50మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించారు. ఒక అమ్మాయి ఛాతీమీద కాలుపెట్టి ఆమెభర్తను అరె్‌స్టచేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవహక్కుల సంఘం, మహిళా కమిషన్‌వరకు తీసుకెళ్తా. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవహక్కుల గురించి మాట్లాడిన కోదండరాం,హరగోపాల్ ఎందుకుమాట్లాడటం లేదు
ఫార్ములా వన్ రేసు కేసులో రూ.55కోట్లను మంత్రిమండలి అనుమతి లేకుండా మీరే ఇప్పించారని ఆరోపణలున్నాయి. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఇవ్వడం అక్రమం అంటున్నారు?
హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు ఫార్ములా వన్ రేస్ నిర్వహించాం. ఇక్కడ రేస్ కాదు ముఖ్యం. రాష్ట్రానికి లాభం జరుగుతుందనేది ప్రధానం. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని పెట్టి ఎలక్ర్టిక్ వాహనాలు విస్తరించేలా ఒక చిన్న విత్తనం నాటి మహావృక్షం చేసే ప్రయత్నం చేశాం. మొదటి ఏడాది స్పాన్సర్‌గా గ్రీన్‌కో కంపెనీ 100 కోట్ల వరకు ఖర్చుచేసింది. ప్రభుత్వం 30-40కోట్లు ఖర్చు చేసింది. రెండో ఏడాదికి గ్రీన్‌కో కంపెనీ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నాం అన్నారు. దీంతో 2023 జూన్, జూలైలో వేరే స్పాన్సర్‌ను వెదకండి అని అరవింద్ కుమార్‌కు ఆదేశాలిచ్చా. ఫార్ములా రేస్ కోసం మొదటి విడత కట్టాల్సిన రూ.55కోట్లు కట్టండి. ఆ తర్వాత ప్రైవేటు స్పాన్సర్‌ను ఒకరు లేదా ఇద్దరిని పట్టుకుందాం. ఈలోపు అంతర్గత సర్దుబాటే కదా! ఇవ్వాలని ఆదేశాలిచ్చా. ఫైలుపై నేనే సంతకం చేశా. ఇక్కడ నేనే అంటే ప్రభుత్వం. హెచ్‌ఎండీఏ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఆ సంస్థకు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఛైర్మన్‌గా నిర్ణయం తీసుకున్నా. దానికి మంత్రిమండలి, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి అక్కర్లేదు. తెలుసుకుని మాట్లాడితే మంచిది.
ఎవనిదిరా.. కుట్ర?
ఎవనిదిరా కుట్ర? నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములు కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ‘నీ అల్లుని కోసమో, అన్నకోసం రైతన్ననోట్లో మట్టికొట్టడం కుట్రకాదా?’ అంటూ సీఎం రేవంత్‌ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏదో ఒకకేసులో తనను ఇరికించి అరె్‌స్టచేస్తావని తెలుసునని, రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు వెళ్తానని కేటీఆర్ పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన సుమారు ఏడాది కాలంలోనే రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ అమలుచేశామని, అయినా అధికారం పోయిందన్న ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ ఉన్నారని మంత్రులు విమర్శిస్తున్నారు?
అధికారం పోయిందని ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌లేదు. గతంలో అధికారంలోకి వస్తామని.. కలలోకూడా ఊహించలేదు. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి వందరోజుల్లో ఏదో పొడుస్తా అన్నారు. ఏం పొడిచారు? ఏం చేశారు? అనేవి చర్చించేందుకు రేవంత్‌రెడ్డి మొగాడైతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లి, లేకుంటే ఆయన నియోజకవర్గం కొడంగల్‌కు సెక్యూరిటీ లేకుండా రావాలి. అక్కడే చర్చ చేయవచ్చు. ఎక్కడనేది అతనిష్టం. వెళ్లిన తర్వాత ప్రభుత్వం బాగుందా? బాగాలేదా? అడుగుదాం. లేదంటే ఆయన కొడంగల్‌లో అయినా...నేను సిరిసిల్లలో అయినా రాజీనామా చేద్దాం. ఎక్కడంటే అక్కడ అతనిష్టం. రాజీనామా చేసి పోటీచేస్తే ఈ ప్రభుత్వం అద్భుతమా? వైఫల్యమా? తేలిపోతుంది.
ఫార్ములా వన్ రేస్ కేసులో మిమ్మల్ని విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చూడాలంటూ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మిలాఖత్ మంతనాలు చేశారని మంత్రులు విమర్శిస్తున్నారు?
గవర్నర్ వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి కలిస్తే అర్థమేంటి? సీఎం వెళ్లి గవర్నర్ ద్వారా మోదీకి సందేశాలిచ్చారా? సీఎం మీద, మంత్రి పొంగులేటి మీద ఈడీ కేసులు పెట్టొద్దని చెప్పారా? నేను రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి అమృత్ టెండర్లు ఇవ్వడంపై ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశా. రేవంత్‌రెడ్డి భాషలో చెప్పాలంటే... నువ్వు మగాడివైతే సిట్టింగ్ న్యాయమూర్తి, లేకుంటే మాజీ న్యాయమూర్తితో అమృత్ టెండర్లపై విచారణ వేయించు. నిజాలు నిగ్గుతేలతాయి.
ఫోన్‌ట్యాపింగ్ కేసులోను మీ ప్రమేయమే ఉందని అంటున్నారు?
ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. ఏ విచారణ చేసుకుంటారో చేసుకోవచ్చు. నేను సిద్ధం బురదలో ఉన్నా కాబట్టి బురద పూస్తా. జైలుకు పోయా కాబట్టి జైలుకు పంపుతా అంటే అది ఆయన పైశాచికం.
అన్ని కేసుల్లోను మీ పేరే ఎందుకు తెరమీదకు వస్తుంది?
రేవంత్‌రెడ్డికి నాపై ప్రేమ. అభిమానం. సర్వదా కృతజ్ఞుడిని.
ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా విపక్షంగా మీరు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తున్నారా?
మా విమర్శకులు ఏడాదిలోనే ఇంత స్పీడా? అని అంటున్నారు. ఏడాదైనా సమయం ఇవ్వాలని కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంపైనా వీళ్లు విమర్శలు చేస్తున్నారు. ఆయన మౌనం కూడా వీళ్లకు భయం కలిగిస్తోంది. ప్రభుత్వ ఏడాది పాలనపై ద్వితీయ శ్రేణిలో మేం వైఫల్యాల వారోత్సవం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఈ ప్రభుత్వం పనితీరు ప్రజలకూ తెలిసిపోయింది. ప్రభుత్వానికి నేనైతే మైనస్ 10మార్కులు వేస్తాను.
కేటీఆర్‌తో కేసీఆర్‌ను...ఆ తర్వాత హరీశ్‌తో కేటీఆర్‌ను ఫినిష్ చే యిస్తాం అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏమంటారు?
కేసీఆర్‌ను ఫినిష్ చేయాలనుకున్నవాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. గత 24ఏళ్లలో కేసీఆర్‌ను ఫినిష్ చేయాలని అన్నవాళ్లు ఎక్కడున్నారో చూడాలి. రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఆయన శ్రేయోభిలాషులతో మాట్లాడితే తెలుస్తుంది.