High Court: 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:33 AM
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది.
ఫార్ములా-ఈ రేసు కేసులో హైకోర్టు ఆదేశం
క్వాష్ పిటిషన్‌పై విచారణ 27కు వాయిదా
జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులా?
గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్‌ఐఆర్
కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది
విదేశీ సంస్థకు చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు
రేస్‌లో లాభాలొస్తే స్పాన్సర్ వెళ్లిపోతారా..?: ఏజీ
రాజకీయ, వ్యక్తిగత కుట్రతోనే కేటీఆర్‌పై కేసు
హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు
ఫార్ములా-ఈ రేస్‌తో రూ.110 కోట్ల లాభం
14 నెలల కిందటి అంశంపై ఇప్పుడు కేసా?
రేస్ రద్దవకుండా నాటి సర్కారే ముందుకొచ్చింది
అరెస్ట్ సహా తదుపరి ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వండి
కేటీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది సుందరం
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి, మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్‌కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున.. రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ రోస్టర్ కలిగిన జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. క్వాష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించింది.
మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కేటీఆర్ తరఫున వాదనలు ప్రారంభించారు. కేవలం రాజకీయ, వ్యక్తిగత కుట్ర కారణంగానే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. ‘హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు, దేశంలోనే ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన తొలి నగరంగా నిలిపేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేసింది. అందులో భాగంగానే మూడు పక్షాల మధ్య మొదటి ఒప్పందం జరిగింది. ఈ రేసుకు ప్రజల్లో ఆసక్తి ఉంది. రూ.వందల కోట్ల వ్యాపారం జరిగింది. 9వ సీజన్ తర్వాత 10వ సీజన్ నిర్వహించే నాటికి స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో రూ.కోట్లు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా కారాదని, ఈవెంట్ కుప్పకూలిపోకూడదని, హైదరాబాద్ ఖ్యాతి నిలబడాలని, ఫార్ములా రేస్ నిర్వహించిన అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే స్పాన్సర్‌గా ముందుకొచ్చి రెండో ఒప్పందం చేసుకుంది. పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు, నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎక్కడా లేదు. ఏమైనా విభేదాలు ఉంటే ఒప్పందంలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది. కాబట్టి ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు ఎఫ్‌ఐఆర్‌లో లేదు.
మరోవైపు 14 నెలల కింద జరిగిన వ్యవహారానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? ‘లలిత కుమారి’ ‘చరణ్‌సింగ్’ తీర్పుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తీవ్రమైన కేసు నమోదులో జాప్యం ఉంటే ప్రాథమిక దర్యాప్తు చేయాలి. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ప్రాథమిక దర్యాప్తు ఎక్కడ ఉంది. కేసు నమోదు చేసిన అధికారే ప్రాథమిక దర్యాప్తు చేయాలి. కానీ, ఫిర్యాదుదారైన ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు ముందే పూర్తి చేసిన తర్వాత ఫిర్యాదు చేస్తుందా? ఇదెక్కడి విడ్డూరం? ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదు? అంత దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఆ సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసింది. అక్కడ పరువుపోతుందని ప్రభుత్వానికి తెలుసు. ఇది ఒక చట్టబద్ధమైన ఒప్పందం. దీనికి సంబంధించి వ్యక్తులకు క్రిమినల్ లయబిలిటీ అంటగట్టడం సరికాదు. ఈ-రే్‌సపై ప్రజల్లో ఆసక్తి ఉంది. భారీగా వ్యాపారం జరిగింది. రూ.110 కోట్ల లాభం వచ్చింది. లాభం వచ్చిన వ్యాపారాన్ని ఎవరైనా కాదనుకుంటారా? ప్రస్తుత ప్రభుత్వం అత్యంత చెత్త నిర్ణయం తీసుకుంది. డబ్బులు చెల్లించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కేవలం రాజకీయ కుట్రతో నమోదైన కేసు కాబట్టి ఇది న్యాయసమీక్షకు నిలవదు. కేసును కొట్టేయాలి. అప్పటివరకు కేసులో పిటిషనర్ అరెస్ట్ సహా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
కేటీఆర్ పాత్ర ఏంటనేది దర్యాప్తులో తేల్చుతాం: ఏజీ
అసలు జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని.. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా, బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా, రెగ్యులేటరీ అనుమతులు లేకుండా చెల్లింపులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ‘ప్రాథమిక దర్యాప్తు జరగలేదని పిటిషనర్ చేస్తున్న ఆరోపణ తప్పు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా కేసు నమోదుకు గవర్నర్ అనుమతి పొందాం. అక్టోబరు 18న ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రాథమిక కేసు లేదని ఆరోపిస్తున్నారు. అదీ నిజం కాదు. విదేశీ సంస్థకు చెల్లింపులు చేయడంలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయి. స్పాన్సర్ వెళ్లిపోయిన తర్వాత రెండో ఒప్పందం జరగడానికి ముందే చెల్లింపులు చేశారు. దీన్నిబట్టి పిటిషనర్‌కు దురుద్దేశం ఉన్నట్లే. రూ.55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది.
డబ్బును విదేశీ మారకంలో చెల్లించారు. అది కూడా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారు. రెగ్యులేటరీ అనుమతులు లేకుండా, విదేశీ మారకంలో చెల్లించడం వల్ల హెచ్‌ఎండీఏకు అదనంగా జరిమానాలు పడ్డాయి. దీనికి తోడు మౌలిక సదుపాయాలకు అదనంగా ఖర్చుపెట్టారు. 110 కోట్లు లాభం వచ్చిందని చెబుతున్నారు. అలా వస్తే స్పాన్సర్ సంస్థ ఎందుకు డీఫాల్ట్ చేసి వెళ్లిపోయింది? ఎఫ్‌ఐఆర్ ఇప్పుడే నమోదైంది. ఎవరు నిందితులు? కేటీఆర్ పాత్ర ఏంటి? ఎవరు లబ్ధిదారులు? అనేది దర్యాప్తులో తేలుతుంది. ఎఫ్‌ఐఆర్ అనేది ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే. అది ఎన్‌సైక్లోపీడియా కాదు. అన్ని విషయాలు చార్జిషీట్‌లో ఉంటాయి. చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు, బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ నిరూపిస్తోంది. గవర్నర్ అనుమతి సైతం ఉంది. ఈ దశలో జోక్యం చేసుకోవడం వల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది’ అని ఏజీ పేర్కొన్నారు.